కాకినాడ పోర్టు సిటీగా పేరు సంపాదించుకుంది. తూర్పు గోదావరి జిల్లాలో ప్రధాన పట్టణమైన కాకినాడ భారతదేశ తూర్పు తీర ప్రాంతంలో ఉన్న ముఖ్యమైన రేవు పట్టణం. న్యూయార్క్ నగరంలో ఉన్నట్లు వీధులు సమాంతరంగా ఉండటం, కూడళ్లు ఒకదానికొకటి లంబంగా ఉండడం ఈ నగర ప్రత్యేకత. ప్రణాళికాబద్ధంగా ఉన్న కారణంతో దీన్ని కో-కెనడా అని, ప్రముఖమైన ఓడరేవుగా ఉండటంతో రెండవ మద్రాసు అని, చమురు అన్వేషణ, వెలికితీత కార్యక్రమాలతో మినీ ముంబయి అంటూ పిలుస్తుంటారు. ప్రశాంత వాతావరణానికి మారుపేరైన ఈ పట్టణానికి పెన్షనర్స్ పారడైస్ గా పేరుంది. ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం రసాయనాలు పెట్రోరసాయనాల పెట్టుబడి ప్రాంతం పరిధి కాకినాడని ఆనుకొనే మొదలవుతుంది. ఈ మధ్యకాలంలో కేజీ బేసిన్ రాజధానిగా విదేశాలలో ప్రాముఖ్యతని సంతరించుకుంది. కాకినాడ పేరు మొదట కాకి నందివాడ అని ఉండేదని, కాలక్రమంలో కాకినాడగా మారిందని చెబుతారు. స్వాతంత్ర్యం రాక ముందు కొంతకాలం కొకనాడగా చలామణి అయ్యింది. బిటీష్ వారు మనదేశంలోకి కొత్తగా వచ్చిన రోజుల్లో ఇక్కడ పండే పంటల్నీ, విలువైన వస్తువుల్నీ తమ దేశానికి ఎగుమతి చేసుకునేందుకు రవాణా సౌకర్యం కలిగిన అనువైన ప్రదేశం కోసం ఈ ప్రాంతాన్ని ఎన్నుకున్నట్లు తెలుస్తొంది. వారి కాలంలో కాకెనాడ /కోకనాడగా పిలువబడి, స్వాతంత్ర్యం వచ్చాక పేరు కాకినాడగా మార్చబడింది. అయితే స్వాతంత్ర్యం రాక మునుపు బ్రిటిషు వారి పరిపాలన సమయంలో స్థాపించబడిన సంస్థల పేర్లు కోకనాడగానే ఉన్నాయి. వాటిలో కోకనాడ చేంబర్ ఆఫ్ కామర్స్, జేఎన్టీయూలోని కొన్ని శిలాఫలకాలు, భారతీయ రైల్వే వారి స్టేషను కోడ్లు, కాకినాడ పోర్టు, కాకినాడ టౌన్ ఉన్నాయి.
1967లో నియోజకవర్గంగా ఏర్పడిన కాకినాడ తరువాత కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్ గా విభజించారు. ప్రస్తుతం అర్బన్ పరిధిలో 1,70 వేల ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గం మొత్తం పట్టణ ప్రాంతంలోనే ఉంది. ఇక్కడ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉన్నారు. మొత్తం జనాభాలో 40 శాతం వారే ఉంటారు. మిగిలిన వారిలో కాపులు, ఇతర బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల వాళ్లు ఉన్నారు. ఒకప్పుడు పెన్షనర్స్ పారడైజ్ గా పేరున్న కాకినాడలో ప్రస్తుతం ఎటుచూసినా సమస్యలే దర్శనమిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కాకినాడను స్మార్ట్ సిటీగా ప్రకటించి కోట్లలో నిధులు విడుదల చేస్తున్నప్పటికీ వాటిని సక్రమంగా ఉపయోగించడంలేదని లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. డ్రైనేజ్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. సరైన మురుగునీటి పారుదల సౌకర్యం లేకపోవడంతో చిన్నపాటి వర్షానికే రోడ్లు చెరువుల్లా మారుతున్నాయి. పట్టాణంలో దోమలు, పందులు, చెత్త కంపుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో రోడ్ల విస్తరణ సరిగా లేక తరచూ ట్రాఫిక్ జాం అవుతున్నాయి. కొండయ్య పాలెం వద్ద నిర్మిస్తున్న రైల్వే గేట్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాలేదు. పనుల్లో తీవ్రమైన ఆలస్యం జరుగుతుంది.
సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న డంపింగ్ యార్దుకు శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై చాలాసార్లు ఆందోళనలు కూడా చేశారు.