ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

కాకినాడ రూరల్ నియోజకవర్గం

కాకినాడ పట్టణానికి చుట్టూ విస్తరించి ఉంటుంది కాకినాడ రూరల్ నియోజకవర్గం. గతంలో ఉన్న సంపర నియోజకవర్గానికి బదులుగా, 2009 శాసనసభల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పాటు చేసారు. అభివృద్దికి బాగా ఆస్కారమున్న ప్రాంతం ఇది. నియోజకవర్గంలో కరప, కాకినాడ గ్రామీణ, పాక్షికంగా కాకినాడ పట్టణ మండలాలు ఉన్నాయి. 46 గ్రామాలు ఉన్న ఈ నియోజకవర్గంలో మొత్తం 190152 మంది ఓటర్లు ఉన్నారు. కాపులు, బీసీలు ప్రధాన సామాజికవర్గాలు కాగా దళితుల ఓట్లు కీలకంగా ఉన్నాయి. 2014లో టీడీపీ తరుపున పోటీ చేసి పిల్లి అనంత లక్ష్మి ఎమ్మెల్యేగా గెలిచారు.

నియోజకవర్గంలో ప్రధానంగా తాగునీటి సమస్య ఉంది. కొన్ని ప్రాంతాల్లో వారానికి ఒకసారి వచ్చే ట్యాంకర్ల నుంచి నీళ్లు పట్టుకుని తాగుతున్నారు. నిల్వ చేసుకున్న నీళ్లు మధ్యలో అయిపోతే ఉప్పు నీళ్లే దిక్కు అంటున్నారు ప్రజలు. తీర ప్రాంతానికి దగ్గర్గా ఉన్న తూరంగి, వాకలపుడి, వలసపాక గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. కాకినాడ నగరం పక్కనే ఉన్నా మునిసిపల్ కార్పోరేషన్ నీరు అందదు. బోర్లు వేసుకుని శుద్ది చేసుకుని తాగుదామంటే నీటిలో ఉప్పు శాతం ఎక్కువగా ఉండటంతో ఆ ప్యూరిఫై మిషన్లు కూడా పని చేయవు. సమస్య ఇంత తీవ్రస్థాయిలో ఉంటే అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు గ్రామాల ప్రజలు. నియోజకవర్గంలో గతంలో వేసిన రోడ్లలో నాణ్యత లోపం కనిపిస్తుంది.

గ్రామాల్లో డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉంది. చాలా చోట్ల మురికి కాలువలు నిర్మించలేదు. కొన్నిచోట్ల కట్టినా లోపాల కారణంగా మురుగు నీరు బయటకు వెళ్లకపోవడంతో నీరు నిల్వ అయి దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారుతున్నాయి. దీంతో ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో పీ హెచ్ సీ సెంటర్ లు ఉన్నా వాటిలో కనీస సదుపాయాలు కల్పించలేదు. అనుభవం ఉన్న డాక్టర్లు అందుబాటులో లేకపోతుండటంతో ఏ చిన్న సమస్యకైనా కాకినాడ వెళ్లాల్సిందే. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రధాన ఆకర్షణ బీచ్. చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి టూరిస్టులు వస్తుంటారు. ఈ బీచ్ అభివృద్ది కోసం ప్రభుత్వం గతంలో రూ. 45 కోట్లు మంజూరు చేసినా పనులు నత్తనడకన సాగుతున్నాయి. బీచ్ లో కట్టాల్సిన భవనాలు, మౌళిక వసతుల కల్పన ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి.

Top