ముమ్మిడివరం నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. ఈ నియోజకవర్గం 1978లో ఏర్పాటు చేయగా అప్పటి నుంచి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా ఉంది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా తాళ్లరేవు మండలాన్ని ఇందులో చేర్చి జనరల్ నియోజకవర్గంగా మార్చారు. ముమ్మిడివరం, ఐ పోలవరం, కాట్రేనికోన, తాళ్ళరేవు మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. మొత్తం 203973 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార, శెట్టిబలిజ, కాపు, ఇతర సామాజికవర్గాల వారు ప్రముఖంగా ఉండగా వీరిలో ఎస్సీ, ఎస్టీల ఓట్లు కీలకం. దివంగత లోకసభ స్పీకర్ జీయంసీ బాలయోగీ ఇక్కడి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో ప్రాతినిథ్యం వహించారు. 2014లో వైసీపీ అభ్యర్థి వెంకట సాయి శ్రీనివాస రావుపై టీడీపీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు విజయం సాధించారు. గతంలో ఈ నియోజకవర్గం నుంచి పొన్నాడ వెంకట సతీష్ కుమార్, పినిపే విశ్వరూప్, చెల్లి వివేకానంద, బత్తిన సుబ్బారావు, పండు కృష్ణ మూర్తి, వల్టాటి రాజసక్కుబాయి, మోకా విష్ణు ప్రసాద రావులు శాశన సభ్యులుగా పని చేశారు.
నియోజకవర్గంలో ప్రధానంగా తాగునీటి సమస్య ఉంది. 35 యేళ్ల క్రితం వేసిన పైపులు చాలాచోట్ల తుప్పు పట్టి పగిలిపోతుండగా పగిలిపోయి పైపులద్వారా మురికి నీరు, మంచి నీరు కలిసి సరఫరా అవుతోంది. ఈ నీటిని తాగి ప్రజలు అనారోగ్యాలబారిన పడుతున్నారు. జిల్లాలో పెద్ద నియోజకవర్గం అయిన ముమ్మిడివరంలో ఆ స్థాయిలో సౌకర్యాల కల్పనకు ప్రజాప్రతినిధులు కృషి చేయాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గంలో మరో ప్రధాన సమస్య లంక గ్రామాలకు రవాణా సదుపాయం. బయటి నుంచి ఊళ్లలోకి వెళ్లేన్దుకు రవాణ సౌకర్యం లేకపోవడంతో పడవలను ఆశ్రయిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో, లేదంటే రాత్రి పూట ఊళ్లు దాటి వెళ్లలేని పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. గోదావరికి వరదలు వచ్చాయంటే ప్రజలు గ్రామాలకే పరిమితం కావాల్సి ఉంటుంది. లేదంటె ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సిందే. మూలపాలెం, సలాదివారి పాలెం వద్ద బ్రిడ్జీలు నిర్మిస్తె సమస్య తీరుతుందని ప్రజలు కోరుతున్నారు. యేళ్ల తరబడి ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు హామీలు ఇస్తూనే ఉన్నా బ్రిడ్జిల నిర్మాణ పనులు మాత్రం జరగడం లేదు. మూలపాలెం బ్రిడ్జి కడితే ఐ పోలవరం, కాట్రేనికోన మండలాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. నియోజకవర్గంలో మరొకటి సలాదివారిపాలెం బ్రిడ్జ్ నిర్మాణ పనులు ముందుకు సాగలేదు. దీని నిర్మాణానికి 35 కోట్ల రూపాయలు వ్యయం అంచనా వేసిన అధికారులు అక్కడితో ఆగిపోయారు. నాలుగు లంక గ్రామాలకు రవాణా సౌకర్యం లేకుండా పోయింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పడవలను ఆశ్రయించక తప్పటం లేదు.