పెద్దాపురం ఒక సాంస్కృతికపరంగా, చరిత్రకంగా ఒక పురాతన పట్టణం. ఈ పట్టణానికి 1915లోనే మునిసిపాలిటి హోదా పొందింది. ఇది రాష్ట్రంలోని భీమునిపట్టణం తరువాత రెండవ అతి పురాతన మునిసిపాలిటి. ప్రతీ సంవత్సరం ఆషాఢ మాసంలో నెల పాటు మరిడమ్మ తల్లి జాతర నిర్వహిస్తారు. ఈ సమయంలో పట్టణంలో పండుగ వాతావరణం కనిపిస్తుంది. ప్రతీ ఆదివారం పట్టణంలో ఒక్కో వీధిలో వంతుల వారీగా సంబరాలు జరుపుతారు. పెద్దాపురం పట్టణంలో జనాబ్ మదీనా పాష్ఛా ఔలియా దర్గా ఉంది. ప్రతీ సంవత్సరం జనవరి 20న జరిగే ఉరుసు ఉత్సవాలు కులమతాల తారతమ్యం లేకుండా అన్ని మతాలవారు పాల్గొంటారు. ప్రతి ఆదివారం జరిగే పెద్దాపురం సంత ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఆచార్య ఎన్ జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న వ్యవసాయ పరిశోధనా క్షేత్రంలో రాగి మరియు కర్ర పెండలం మీద పరిశోధన జరుగుతాయి. పట్టణములో గుర్తింపు పొందిన శ్రీ రాజా వత్సవాయి జగపతి బహద్దూర్ మహారాణి కళాశాల పెద్దాపురం సంస్థానం మహారాణి బుచ్చి సీతయమ్మల జ్ఞాపకార్ధము 1967లో అప్పటి జిల్లా పరిషత్ అధ్యక్ష్యుడు బలుసు పీ బీ కే సత్యనారాయణ రావు ప్రారంబించారు. పెద్దాపురంలో పాండవుల మెట్టకు పౌరాణిక గుర్తింపు ఉంది. ఇక్కడ భీముని పాద ముద్రలు, పురాతన గుహలు చూడవచ్చు. భారత దేశ స్వాతంత్ర్యానికి ముందే పెద్దాపురం విద్యాపరంగా అభివృద్ది చెందింది. 1891లో ఎడ్వర్డ్ ఇమ్మానుయేల్ స్థాపించిన లూథరన్ ఉన్నత పాఠశాల పెద్దాపురంలో మంచి పేరున్న విద్యాలయం. తదనంతరం అనేక పాఠశాలలు నెలకొల్పబడి నేటి పెద్దాపురం విద్యాకేంద్రంగా వెలుగొందుతుంది.
పెద్దాపురం నియోజకవర్గం 1952లో ఏర్పడింది. పెద్దాపురం, సామర్లకోట మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఓటర్ల సంఖ్య 2 లక్షల 41 వేల మంది. వీరిలో కాపులే ఎక్కువ. నియోజకవర్గ జనాభాలో సుమారు 45 వేల వరకు వారే ఉంటారు. తరువాతి స్థానాల్లో బీసీలు, ఎస్సీలు ఉన్నారు. 2014 ఎన్నికల్లో నిమ్మకాయల చినరాజప్ప టీడీపీ తరుపున పోటీ చేసి విజయం సాధించారు. గతంలో పంతం గాంధీ మోహన్, తోట గోపాల కృష్ణ,బొడ్డు భాస్కర రామారావు, పంతం పద్మనాభం, బలుసు రామారావు, వుండవల్లి నారాయణ మూర్తి, కొండపల్లి కృష్ణమూర్తి, వుండవల్లి నారాయణ మూర్తి, దూర్వాసుల వెంకట సుబ్బారావులు శాసన సభ్యులుగా పనిఛేశారు.
నియోజకవర్గంలో మంచినీటి సమస్య ప్రధానమైంది. రెండురోజులకు ఒకసారి మంచినీళ్లు ఇస్తున్నారు. అవి కూడా రంగు మారి వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. కలుషితమైన నీటిని తాగి రోగాల బారిన పడుతున్నామని అంటున్నారు. రోడ్లు, డ్రైనేజి అధ్వాహ్నంగా ఉన్నాయి. పూర్తిస్థాయిలో వేయాల్సిన రోడ్లు ఒకచోట వేసి మరోచోట వదిలేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా సామర్లకోట, పెద్దాపురం రోడ్లు విస్తరిస్తారని ఆశించారు. పీ హెచ్ సీ లలో వైద్య సేవలు సరిగా అందటం లేదు. నియోజకవర్గం పరిధిలో అక్రమంగా మొరం తవ్వకాలు జరుగుతున్నాయి. పదుల ఎకరాలకు అనుమతులు తీసుకుని వేల ఎకరాలలో విచ్చలవిడిగా తవ్వి అమ్మేసుకుంటున్నారు.