పిఠాపురాన్ని పూర్వం పీఠికాపురం అనేవారు. ఈ ఊరికి అధిపతి పీఠాంబ. ఒక చేతిలో బంగారు పాత్ర, మరో చేతిలో బాగా పండిన ఉసిరికాయ, మూడవ చేతిలో త్రిశూలం, నాలుగో చేతిలో లోహ దండం ధరించి పిఠాపురానికి సమీపంలో, నాలుగు వీధులు కలిసే కూడలిలో పీఠాంబ విగ్రహం ఉండేదట. ఇటువంటి విగ్రహమే కొత్తపేట కుమారస్వామి ఆలయంలో ఉంది. ఈ విషయాన్ని ప్రముఖ కవీశ్వరుడు శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో వర్నీంచాడు. సముద్ర గుప్తుడు అలహాబాదు శాసనములో పిఠాపురం నాలుగో శతాబ్దపు తొలినాళ్లలో రాజధానిగా ఉన్నట్లు తెలుపబడింది. పిఠాపురంలో దొరికిన జైన విగ్రహాల మీద ఉపవాస క్లేశ చిహ్నాలు, వాటి రొమ్ము మీద ఉన్న కొన్ని గాడులూ, తాటిపాక విగ్రహాలు, పెనుమంచిలి చౌముఖములు మొదలైనవి అన్నీ కోన రాజ్యము ఏర్పడిన 12వ శతాబ్దం తరువాతవని తెలుస్తున్నది. వీటిని బట్టి పిఠాపురానికి చాలా చరిత్ర ఉన్నట్లు తెలియుచున్నది. దీనిని పిష్ఠపురం అని కూడా పిలిచేవారు.
పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం, యూ కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాలు ఉన్నాయి. 1951లో నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి పిఠాపురం, గొల్లప్రోలు మండలాలు ఈ నియోజకవర్గంలో ఉండగా 2009 పునర్విభజన తరువాత సంపర పరిధిలో ఉన్న యూ కొత్తపల్లి మండలం ఇందులో కలిసింది. మొత్తం 2 లక్షల 30 వేల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో కాపు సామాజికవర్గ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సంఖ్యాపరంగా పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లో ఎక్కువగా ఉన్నారు. యూ కొత్తపల్లిలో మత్స్యకార, చేనేత వర్గాలవారు ఉన్నారు. ఇక్కడ గెలిచిన పార్టీ అభ్యర్థి పార్టీ రాష్ట్రస్థాయిలో ఓడిపోతుందన్నది స్థానికుల నమ్మకం. గత 30 యేళ్లుగా ఇది కొనసాగుతూ వస్తుంది. 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఎస్ వీ ఎస్ ఎన్ వర్మ గెలిచారు. అనంతరం ఆయన టీడీపీలో చేరారు.
పిఠాపురం మినీ స్టేడియం, పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజీలకు కొత్త భవనాలు నిర్మించడం, ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా మంచి నీరు సరఫరా, ఈబీసీ పరిహారం, నక్కలకండి, సుద్దగడ్డ కాలువలను వెడల్పు చేయడంతోపాటు గ్రామాల్లో ఇరుకు రోడ్లు విస్తరించడం, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజి సమస్యను పరిష్కరించడం ఈ ప్రాంతంలో ప్రధాన సమస్యలు. వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్న పిఠాపురం, గొల్లప్రోలు మండలాల రైతులకు ఏలేరు ప్రధాన నీటి వనరుగా ఉంది. ఈ ఆయకట్టు పరిధిలో 65 వేల ఎకరాలు సాగులో ఉంది. 30 యేళ్ల నుంచి ఈ ఆయకట్టు ఆధునీకరించకపోవడంతో రెండో పంటకు నీరందక రైతులు నష్టపోతున్నారు. కాలువల్లో ఉన్న పూడిక తీయించాలని, గుర్రపు డెక్కను తొలగించాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆగ్రహంతో ఉన్నారు. దీనికితోడు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే ఏలేరు చివరి భూములు ముంపునకు గురవుతున్నాయి. ఆరుగాలం శ్రమించి సాగు చేసినా చేతికి అందివచ్చిన పంట నీళ్లపాలవుతుండని రైతులు వాపోతున్నారు. వందల కోట్లు ఖర్చు చేసి పురుషోత్తమపట్నం ప్రాజెక్టు కడుతున్న ప్రభుత్వం ఈ చిన్న సమస్యను ఎందుకు పరిష్కరించరని రైతులు ప్రశ్నిస్తున్నారు. యూ కొత్తపల్లి మండలంలో సముద్ర అలల తాకిడికి ఉప్పాడ, కొనపాపపేటా గ్రామాల్లో కొంతమేర ఇళ్లు సముద్రంలో కలిసిపోయాయంటే తీవ్రత ఎలా ఉండో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వపరంగా రక్షణ చర్యలు తీసుకోవలని కోరుతున్నారు.
సెజ్ పేరుతో 12 వేల ఎకరాల భూములు సేకరించినా ఇప్పటివరకు ఏ ఒక్క పరిశ్రమను ఏర్పాటు చేయలేదు. ఆ భూములు నిరుపయోగంగా మారాయని పరిశ్రమలు ఏర్పాటు చేసి వాటిల్లో తమకు ఉపాధి కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. తీరప్రాంతంలో అడ్డూ అదుపూ లేకుండా జరుగుతున్న అక్రమ ఇసుక దందాలు అరికట్టాలని, పర్యాటకంగా అభివృద్ది చేస్తే స్థానికంగా ఉపాధి దొరుకుతుందని ఈ నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.