ప్రసిద్ద ఆలయాలు, విమానాశ్రయం, విశ్వ విద్యాలయం రాజానగరం నియోజకవర్గ ప్రత్యేకతలుగా చెప్పుకోవచు. గోదావరి నదిపై మూడు భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి. 60కి పైగా గ్రామాలతో పూర్తి గ్రామీణ వాతావరణంలో నియోజకవర్గం విస్తరించి ఉంటుంది. ఒకప్పటి బూరుగుపల్లి నియోజకవర్గం రాజానగరం పేరుతో కొనసాగుతోంది. నియోజకవర్గంలో కోరుకొండ, సీతానగరం, రాజానగరం మండలాలు ఉన్నాయి. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా బూరుగుపూడి నియోజకవర్గం రాజానగరంగా మారింది. అప్పటి వరకు ఈ నియోజక వర్గంలో ఉన్న గోకవరం మండలం జగ్గయ్యపేటలోకి వెళ్లగా రాజమండ్రి రూరల్ లోని రాజానగరం మండలం ఇందులో కలిసి నియోజకవర్గ కేంద్రం అయింది. 2014 ఎన్నికల్లో పెందుర్తి వెంకటేష్ విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లు 189530 మంది. సామాజిక సంఖ్య పరంగా చూస్తే అత్యధికంగా బీసీలు, కాపులు, ఎస్సీలు ఇతర వర్గాల ఓటర్లు ఉన్నారు. అయితే కుల సమీకరణంతో సంబంధం లేకుండా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రలో భాగంగా బూరుగుపుడి నియోజకవర్గంలో అస్వస్థతకు గురై కొద్దిరోజుల పాటు ఇక్కడి మామిడి తోటల్లో విశ్రాంతి తీసుకున్నారు.
కోరుకొండలో ఎత్తైన కొండపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇక్కడ స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు అతి క్లిష్టమైన మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకుంటారు. కణుపూరు కొండపై వెలసిన శివయ్య క్షేత్రం కూడా ప్రసిద్ద ఆలయంగా విరాజిల్లుతుంది. మధురపుడి గ్రామం పరిధిలోని రాజం విమానాశ్రయం, వెలుగుబంధ గ్రామం వద్ద ఆదికవి నన్నయ్య యూనివర్సిటి, నియోజకవర్గం మీదుగా వెల్తున్న చెన్నై-కోల్ కత్తా 16వ నెంబర్ జాతీయ రహదారి, మెడికల్, ఇంజనీరింగ్, డెంటల్ కాలేజీలు రాజానగరంలో ఉన్నాయి. మరోవైపు మూడు భారీ ప్రాజెక్టులతో ఈ నియోజకవర్గం ఇరిగేషన్ రంగంలో ప్రత్యేకంగా నిలుస్తోంది. గత ప్రభుత్వాల హయాంలో నిర్మించిన పుష్కరఘాట్లు, చాగల్నాడు సహా ఇటీవల నిర్మాణం పూర్తి చేసుకున్న పురుషోత్త పట్టణం ఎత్తిపోతల పథకం ద్వారా ఈ నియోజకవర్గం నుంచే గోదావరి జలాలు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. సీతానగరం మండలంలోని గోదావరి పరివాహక గ్రామాల్లో మొక్కజొన్న పంటను వేల ఎకరాల్లో సాగు చేస్తారు. రాజానగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో మామిడి, సీతాఫలం తోటలు విస్తరించి ఉన్నాయి.
రాజానగరం నియోజకవర్గంలో ఎక్కువగా గ్రామీణ వాతావరణమే కనిపిస్తుంది. మూడు మండలాల్లోని గ్రామాల్లో సిమెంట్ రోడ్డు పనులు పెద్దయెత్తున జరగ్గా ప్రధాన రహదారుల విషయంలో పెద్దగా మార్పు రాలేదు. అనపర్తి ప్రధాన రహదారిపై ప్రయాణించాలంటే ఎన్నో ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. దీంతోపాటు గ్రామాల్లో పారిశుద్ద్యం పరిస్థితి అధ్వాహ్నంగా తయారైంది. పెద్దయెత్తున సిమెంట్ రోడ్డ్ల నిర్మాణం చేస్తున్నా అంతేస్థాయిలో డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపర్చటం లేదు. నియోజకవర్గ కేంద్రం రాజానగరం సహా అనేక గ్రామాల్లో రోడ్డ్లపై మురికి నీరు, వర్షపు నీరు నిలిచిపోయి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గంలో పారిశుద్ద్యం ఎక్కడ వెతికినా కనిపించదు.
నియోజకవర్గంలో రెండు ప్రాజెక్టులకు భూసేకరణ జరిగింది. దీనిలో రాజమండ్రి ఎయిర్ పోర్టు విస్తరణ కోసం చేపట్టిన భూసేకరణ కార్యక్రమానికి రైతులు ఆమోదయోగ్యంగానే తమ భూములు అప్పగించారు. పురుషోత్తపట్నం ప్రాజెక్టు కోసం చేపట్టిన బలవంతపు భూసేకరణతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. న్యాయమైన పరిహారం కోసం డిమాండ్ చేసిన రైతులు తమ గోడును నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు తీసుకెళ్లి న్యాయపోరాటం చేస్తున్నారు. మరోవైపు సీతానగరం మండలంలోని ఇసుక ర్యాంపుల నుంచి పెద్దయెత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతుండటం, మరోవైపు నియోజకవర్గ కేంద్రం రాజానగరంలో మంచినీటిని అందించే రావుల చెరువును అభివృద్ది చేయకపోవడం, డంపింగ్ యార్డు సమస్యలతో ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది.