రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. ఈ నియోజకవర్గంలో రామచంద్రాపురం, కాజులూరు, పామర్రు మండలాలు ఉన్నాయి. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వనవాసం సమయంలో అయోధ్య నుంచి నడిచివస్తూ భద్రాచలం వద్ద పంచవటి నిర్మించుకోవడానికి ముందు రెండుచోట్ల మజిలీ చేశాడట! ఆయన మజిలీ చేసిన ప్రాంతాలు తర్వాత కాలంలో జనావాసంగా మారాయి. మొదటి మజిలీ ప్రస్తుత హైదరాబాద్‌సమీపంలో ఉండగా, రెండో మజిలీ తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకు సమీపంలో ఉంది. ఈ రెండు ప్రాంతాలూ రామచంద్రుడు మజిలీ చేసిన పురాలుగా రామచంద్రపురం పేరుతో ప్రసిద్ధికెక్కాయి. 80 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రారంభించిన ఆర్టోస్ శీతలపానీయాల పరిశ్రమ బీరు ఫాక్టరీగా అభివృద్ధి చెందింది. పట్టణంలో చిన్నతరహా పరిశ్రమలతో పాటు చెల్లూరులోని సర్వారాయ పంచదార కర్మాగారం ఈ ప్రాంతం పారిశ్రామికాభివృద్ధికి దోహద పడ్డాయి. అనేక సినిమాలను చిత్రీకరించిన కాకర్లపూడి వంశానికి చెందిన కోట యిక్కడి ప్రధాన ఆకర్షణ.
ఈ నియోజకవర్గం 1955లో ఏర్పడింది. మొత్తం 181625 మంది ఓటర్లు ఉన్నారు. కాపు, బీసీ సామాజిక వర్గాల ఓట్లు దాదాపు సమాన సంఖ్యలో ఉంటారు. దీంతో గెలుపోటముళ్లొ ఎస్సీలే కీలకంగా మారారు. ఇక్కడ పార్టీల కంటే సామాజిక వర్గాల ప్రభావమే ఎక్కువగా కనిపిస్తుంది. 2014లో ఈ నియోజకవర్గం నుంచి తోట త్రిమూర్తులు శాశన సభ్యునిగా ఎన్నికయ్యారు. గతంలో పిల్లి సుభాష్ చంద్రబోసు, మేడిసెట్టి వీరవెంకట రామారావు, రామచంద్ర రాజు శ్రీ రాజ కాకర్లపూడి, పిల్లి అప్పారావు, సత్యనారాయణ రెడ్డి, ఎం ఎస్ సంజీవి, ఎన్ వీర్రాజు, నందివాడ సత్యనారాయణరావు, కాకర్లపూడి శ్రీ రాజ రామచంద్రరాజు బహదుర్ లు శాశన సభ్యులుగా పని చేశారు.
ఈ ప్రాంతంలో వరి, చెరుకు ప్రధాన పంటలు. 80 శాతం గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు ఉన్నాయి. కానీ నిర్వాహణ లోపంతో పారిశుద్ద్యం లోపించింది. పందుల స్వైర విహారం, చెత్తా చెదారాన్ని రోడ్ల పక్కనే పడేయటంతో కంపు కొడుతున్నాయి. రోడ్లు లేని ఊళ్లలో పాటి వర్షాలకే చిత్తడిగా మారి రాక పోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. కాజులూరు మండలంలో మంచి నీటి సమస్య తీవ్రంగా ఉంది. ప్రైవేటు ఆర్వో ప్లాంట్ల నుంచి నీళ్లు కొనుక్కుని తాగుతున్నారు ఇక్కడి ప్రజలు. జొన్నాడ నుంచి యానాం వెళ్లే గోదావరి యేటి గట్టు రోడ్డు విస్తరణ పనులు సగంలోనే ఆగిపోయాయి. ఈ రోడ్డు పూర్తయితే కాకినాడ విజయవాడ మధ్య దూరం తగ్గుతుంది. కోటిపల్లి, నర్సాపురం రైల్వే లైను కోసం కేంద్ర బడ్జెట్లో 150 కోట్లు కేటాయించినా టెండర్లు పిలవలేదు. కోటిపల్లి నుంచి కోనసీమకు రేవు దాటడమే దగ్గరి మార్గం కావడంతో రోజూ వందల మంది ప్రమాదం అంచున లాంచీల్లో ప్రయాణిస్తున్నారు. కోటిపల్లి రేవు దగ్గర వంతెన కట్టాలని ప్రజలు ఎన్నిసార్లు విన్నవించుకుంటున్నా ఎప్పటికప్పుడు హామీలు ఇచ్చి తప్పించుకోవడమే కానీ పట్టించుకున్న వారు లేరని వాపోతున్నారు.