ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

రంపచోడవరం నియోజకవర్గం

రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లా తూర్పు కనుమలలో విస్తరించి ఉంది. ఎటు చూసినా పచ్చదనమే. దట్టమైన అటవీ ప్రాంతం. నింగిని తాకినట్టు ఉండే కొండలు, గళగళాపారే సెలయేళ్లు, దూకే జలపాతాలు, పక్షుల కిలకిలారావాలు, ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వారికి ఇది భూతల స్వర్గంలాంటి అనుభూతిని ఇస్తుంది. అడుగడుగునా అటవీ సోయగాలు, వందల యేళ్ల పూర్వం నాటి పురాతన ఆలయాలు రంపచోడవరం ఏజెన్సీ సొంతం. కనువిందు చేసే వెదురు వనాలు, మారేడుమిల్లి బొంగు చికెన్, జలతరంగిణి కొండవాగు ప్రవాహం చూడటంకోసం వందల మంది పర్యాటకులు ఇక్కడికి తరలి వస్తారు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే కాగా ఇక్కడే పుట్టి పెరిగి ఈ ప్రాంతాన్నే నమ్ముకుని జీవిస్తున్న ఈ ప్రాంత గిరిజనులకు ఇది నరక కూపంగా ఉంటుంది. పాలకుల నిరక్ష్యం వల్ల, అధికారుల అలసత్వంతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు.

రంపచోడవరం నియోజకవర్గం 1956లో ఏర్పాటు చేశారు. ఇందులో మారెడుమిల్లి, దేవిపట్నం, వై రామవరం, అడ్డతీగల, రంపచోడవరం, రాజవొమ్మంగి మండలాలు ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతమైన ఈ నియోజకవర్గంలో కొండరెడ్లు, కొండ కమ్మరి సామాజిక వర్గాల ఓట్లు ఎక్కువ. మొత్తం ఓటర్ల సంఖ్య 139143 మంది ఉన్నారు. 2014లో వైసీపీ అభ్యర్థి వంతల రాజేశ్వరి ఇక్కడి నుంచి గెలిచారు. నియోజకవర్గంలో పక్కా ఇళ్లు, మంచినీటి సౌకర్యం, ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకీకరణ ఇక్కడ ప్రధాన సమస్యలు. ఎన్నికలు వచ్చాయంటే రాజకీయ నాయకులకు ఇవి అస్త్త్రాలుగా మారుతాయి. రంపచోడవరం నియోజకవర్గంలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. మాన్యం మంచినీళ్ల కోసం అల్లాడుతోంది. అడవుల్లోని సెలయేళ్ల నీరు రకరకాల పరిస్థితుల్లో కలుషితమైపోతున్నాయి. గత్యంతరం లేక గిరిపుత్రులు వాటితోపాటు కుంటల్లోని నీరు తాగి వ్యాధులబారిన పడుతున్నారు. మన్యంలోని మరో ప్రధాన సమస్య వైద్య సదుపాయం. స్థానికంగా సదుపాయాలు లేక 50 నుంచి 70 కిలోమీటర్ల దూరంలోని ఏరియా ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది. అందులోనూ 20 కిలోమీటర్లు కాలి నడక తప్ప రవాణా సదుపాయం లేదు. అంతదూరం వెళ్లలేక నాటు వైద్యంతో ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. ఏజెన్సీలోని మూడు వంతుల గ్రామాలకు కనీస రవాణా సౌకర్యం లేదు. ఇక ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో, లేదంటే ప్రాణాపాయ స్థితుల్లో ప్రాణాలమీదకు వస్తే జోలిలో మోసుకుని వెళ్లల్సిందే.

నియోజకవర్గంలో ప్రధానంగా ఇక్కడ మావోయిస్టుల ప్రభావం ఎక్కువ గా ఉంటుంది. ఈ ఏరియాని షెల్టర్ గా ఉపయోగించుకుంటున్నారు. మందుపాతరల పేలుళ్లు, కూంబింగ్ కోసం వచ్చే పోలీసుల కారణంగా భయం భయంగా గడుపుతుంటారు గిరిజనులు. వరదలు వచ్చినప్పుడు దేవీపట్నం, కూనవరం, వీ ఆర్ పురం మండలాల్లో ఎక్కువశాతం ముంపునకు గురి అవుతుంది. నెలల తరబడి వరద నీటిలో గడపాల్సిందే. పోలవరం ప్రాజెక్టుతో ఇప్పటికే అంగుళురు గ్రామం కనుమరుగు కాగా మరికొన్ని ఊళ్ల పరిస్థితి ఇలాగే ఉంది. నిర్వాసితులకు మాత్రం పూర్తిస్థాయిలో పరిహారం అందలేదు.

Top