పచ్చని చేలు, చుట్టూ కొబ్బరి చెట్లు, పంట కాలువలు ఇలా ఎటు చూసినా కనువిందు చేయడం రాజోలు నియోజకవర్గం సొంతం. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు దాహంగా ఉందని మంచినీళ్ళు అడిగితే, మజ్జిగ ఇచ్చే సాంప్రదాయం ఉన్న ప్రాంతం రాజోలు అంటే అతిశయోక్తి కాదు. ఈ ప్రాంతం నుంచి ఎందరో ప్రముఖులు దేశ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పేరు ఫ్రఖ్యతలు సంపాదించారు. సినిమా పరిశ్రమలో ప్రముఖ దర్శకులు ఆదుర్తి సుబ్బారావు, కట్టా సుబ్బారావు, యువ దర్శకుడు సుకుమార్ తదితరులు కాగా, అంజలి, హేమ, కృష్ణుడు, ప్రవీణ్, ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాల మురళీకృష్ణ, సంగీత దర్శకుడు సత్యం ఇంకా ఎందరో ఈ ప్రాంతానికి చెందినవారు పేరు గడించారు. రాజోలు విహారప్రాంతంగా కూడా పేరు గడించింది. చూడచక్కని ఎన్నో ప్రదేశాలతో పాటు అంతర్వేది శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయం, కడలి కపోతేశ్వర స్వామి ఆలయం, శివకోడు శివాలయం వంటి ఆధ్యాత్మిక ఆలయాలతో పాటు, సేద తీర్చుకోడానికి దిండి రిసార్టు, సోంపల్లిలో ఉన్న పొదరిల్లు రిసార్టు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మహాత్మా గాంధీ బస చేసిన ఇల్లు నేటికి గాంధిహౌస్ గా పిలవబడుతూ మహాత్ముని గౌరవాన్ని కాపాడుతున్న ప్రముఖ న్యాయవాది డాక్టర్ పొన్నాడ హనుమంతరావు రాజోలు పట్టణానికి చెందినవాడే. స్వాతంత్ర పోరాటంలో అధికశాతం ప్రజలు ఉద్యమంలో పాల్గొన్న ప్రాంతం రాజోలు గానే చెప్పుకుంటారు.
రాజకీయ చైతన్యానికి రాజోలు దిట్ట. ఇక్కడ ఏ పార్టి అభ్యర్ది గెలిస్తే అదే పార్టి రాష్ట్రంలో అధికారం లోకి వస్తుండడం ఆచారంగా ఉంది. తూర్పు గోదావరి జిల్లాలో చిట్టచివరి నియోజకవర్గమైన రాజోలు 1956లో ఏర్పడింది. జనరల్ నియోజకవర్గంగా దీన్ని 2009లో ఎస్సీలకు రిజర్వ్ చేశారు. ఈ నియోజకవర్గంలో కులాల ప్రాధాన్యత తక్కువగా ఉంటుంది. అభివృద్ది ఎవరు చేస్తారని ఇక్కడి ప్రజలు నమ్ముతారో వారినే గెలిపిస్తారు. ఈ నియోజకవర్గంలో రాజోలు, మల్కిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు మండలాలు ఉన్నాయి. జిల్లా మొత్తమ్మీద అత్యధిక విస్తీర్ణం ఉన్న నియోజకవర్గం ఇది. కాగా మొత్తం ఓటర్లు 173014 మంది. ఎస్సీ, కాపు, శెట్టిబలిజ సామాజికవర్గాల ఓటర్లు దాదాపు సమానంగా ఉంటారు. గత ముఖ్యమంత్రులు ఎన్టీయార్, రాజశేఖర రెడ్డి లహయాంలో రెండుసార్లు సఖినేటిపల్లి-నర్సాపురం బ్రిడ్జి నిర్మాణం కోసం శంకుస్థాపనలు చేసి శిలాఫలకాలు ఏర్పాటు చేశారు. కానీ బ్రిడ్జి నిర్మాణం మాత్రం జరగలేదు. దీంతో రెండు జిల్లాల ప్రజలకు ఇప్పటికీ పడవలనే ఆశ్రయిస్తున్నారు. మోరీ గ్రామాన్ని స్మార్ట్ విలేజ్ గా ప్రకటించి ఆర్భాటం చేసినా మౌళిక సదుపాయాలు మాత్రం సమకూర్చలేదు.
విలువైన చమురు, గ్యాస్ నిక్షేపాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. వాటిని నిర్వహిస్తున్న ఓఎంజీసీ, గైల్ కంపెనీలకు చెందిన పైపులైన్లు ఎప్పుడు, ఎక్కడ లీక్ అవుతాయో, ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందో అని భయం భయంగానే గడుపుతుంటారు ఇక్కడి ప్రజలు. సముద్రం ఉప్పొంగి తీర ప్రాంతం కోతకు గురవుతుంది. ఉప్పునీరు ముంచుకొచ్చి కొబ్బరి, వరి పంటలు పాడై భూములు బీళ్లుగా మారుతున్నాయి. చేసేది లేక కొందరు పంట భూములను చేపలు, రొయ్యల చెరువులుగా మార్చుకుంటున్నారు.. అక్రమ అక్వా సాగు ఈ ప్రాంతాన్ని ఇంకా కాలుష్యంగా మార్చేస్తోంది. ప్రతి ఏటా గొదావరికి వరదలు వచ్చినపుడు ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు తప్పవు. కొన్ని ఊళ్లయితే నెలల తరబడి నీళ్లలో నానుతుంటాయి. ఆ సమయంలో పునరావాస శిభిరాలే స్థానికులకు దిక్కు. గ్యాస్ కంపెనీలు సామాజిక సేవతో కోట్ల రూపాయలు ఇస్తున్నా అవి స్థానికులకు మాత్రం ఉపయోగపడటం లేదు.