కృష్ణా జిల్లాలోని 16 శాసనసభ నియోజకవర్గాలలో అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గంలోని ఓటర్ల సంఖ్య 196401 గా నమోదయింది. అందులో మగవారి సంఖ్య 97693 కాగా ఆడవారి సంఖ్య 98685.
అవనిగడ్డ నియోజకవర్గం దివిసీమగా పేరొందిన ప్రాంతం. పునర్విభజన తరువాత చల్లపల్లి, ఘంటసాల రెండు మండలాలు కొత్తగా చేరాయి. తూర్పు కృష్ణాప్రాంతంలో కాపు,అగ్నికుల క్షత్రియ,కమ్మ కులాల జనాభా ఎక్కువ.
చల్లపల్లి జమిందార్ యార్లగడ్డ శివరామ ప్రసాద్, మండలి వెంకట కృష్ణారావు, సింహాద్రి సత్యనారాయణ వంటి ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన అవనిగడ్డ నియోజకవర్గం 1962 లో ఏర్పడింది.
మొత్తం పదిసార్లు ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్, కాంగ్రెస్ (ఐ) లు ఏడుసార్లు, తెలుగుదేశం మూడుసార్లు ఇక్కడ గెలిచింది. యార్లగడ్డ శివరామ ప్రసాద్ అవనిగడ్డ నుంచి రెండుసార్లు, అంతకుముందు దివి నియోజకవర్గం నుంచి ఒకసారి మొత్తం మూడుసార్లు గెలవగా, మండలి వెంకట కృష్ణారావు సింహాద్రి సత్యనారాయణ మూడుసార్లు చొప్పున గెలిచారు. రెండుసార్లు కృష్ణారావు కుమారుడు బుద్ద ప్రసాద్ గెలుపొందారు. మండలి వెంకటకృష్ణారావు ఒకసారి ఏకగ్రీవంగా ఎన్నికవడం ఒక ప్రత్యేకత. జిల్లాలో శాసనసభ్యులుగా పోటీచేసి మరెవరికీ ఈ గౌరవం దక్కలేదు. 1952, 55 లలో దివి నియోజకవర్గం ఉండేది.ఆ రెండుసార్లు దివి ద్వి సభ్య నియోజకవర్గంగా కొనసాగింది. ప్రఖ్యాత సిపిఐ నేత చండ్ర రాజేశ్వరరావు సొంత నియోజకవర్గమైన దివలో ఒకసారి ఆయన సోదరుడు చండ్ర రామలింగయ్య గెలుపొందగా చల్లపల్లి రాజా ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత మధ్యంతర ఎన్నికలో రాజేశ్వరరావు స్వయంగా పోటీచేసి చల్లపల్లి రాజాచేతిలో పరాజితులయ్యారు.
కృష్ణా ముఖద్వార౦ దగ్గర చిన్న రాజ్య౦ అవనిగడ్ద! ఇది దివిసీమకు రాజధాని. దీన్ని అవనిజపుర౦ అని సీతాదేవి పేరుతో పిలుస్తారు. క్రీ.శ.3వ శతాబ్దికి చె౦దిన బృహత్పలాయన ప్రభువులు ఈ దీవిని ఏర్పరచారని చెప్తారు. భట్టిప్రోలులో బుద్ధుని అస్థికలున్న భరిణ మీద కుబీరకుడనే యక్షరాజు పేరు ఉ౦దట! ఈ కుబీరకుడు కృష్ణానదికీ, సముద్రానికీ మధ్యలో దివిసీమ నేర్పరచాడ౦టారు. ఆనాడు రోము రాజ్యాధీశుని ఆస్థానానికి రాయబారిని ప౦పిన తెలుగు రాజు జయవర్మ గానీ, త్రిలోచన పల్లవుడు గానీ కావచ్చున౦టారు. అమియానస్ వ్రాసిన వ్రాతల్లో “దివి”(దివిసీమ), “శరణ్‘దివి(హ౦సలదీవి)” అనే పేర్లు కనిపిస్తాయి, అలోసైనీ అని ఆరోజుల్లో అవనిగడ్డని పిలిచారు. వేల స౦వత్సరాల తెలుగు వారి చరిత్రను తన గర్భ౦లో ఇముడ్చుకుని నిలువెత్తు సాక్షిగా నిలిచిన దివిసీమ ఒక చారిత్రక దివ్యసీమ.
పురాణాలలో అవనిజాపురం'గా ప్రసిద్ధిచెందిన గ్రామమే నేటి "అవనిగడ్డ" అని చరిత్ర చెప్పుచున్నది. శ్రీరామచంద్రుడు తన గురువైన వశిష్టుని ఆశ్రమంలో సీతాదేవికి ధర్మశ్రవణం చేయించారని, అందువలన "అవనిజాపురం"గా పిలిచినట్లు ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుచున్నాయి. సీతాదేవి వనవాసం ఉన్నది సీతలంక అనీ, వశిష్టాశ్రమాన్ని వశిష్టమెట్టగా పిలిచేవారు. శాతవాహనుల కాలంలో రేవుకేంద్రంగా, వ్యాపారకేంద్రంగా ఉన్న "అలోషైని" నామంతో ప్రసిద్ధిచెందిన ఓడరేవు ఇది. క్రీ.పూ.3వ శతాబ్దం నుండి క్రీ.శ.13వ శతాబ్ది వరకు, ఈ రేవుద్వారా పెద్ద నావలతో వ్యాపారం జరిగేదనీ,అదే నేటి అవనిగడ్డ గ్రామంగా చరిత్ర చెపుచున్నది. 14వ శతాబ్దం ప్రారంభం నుండి "అవనిగడ్డ" గానే పిలుస్తున్నట్లు చరిత్ర పరిశోధకులు వెల్లడించారు.
అవనిగడ్డ నుండి పలు ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. అవనిగడ్డ నుండి విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, కోడూరు, నాగాయలంక వంటి పలు ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. అదే విధంగా దూర ప్రాంతాలైన కె.పి.హెచ్.బి, ఇ.సి.ఐ.ఎల్, జీడిమెట్లకు పలు బస్సులు ఉన్నాయి. రైల్వేస్టేషన్: విజయవాడ 66 కి.మీ
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, దివిసీమ పాలిటెక్నిక్ కళాశాలలు ఈ నియోజకవర్గం లో ఉన్నాయి.
సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహాలు బాలుర మోడల్ హాస్టల్ మరియూ బాలికల వసతిగృహాలు ఉన్నాయి. విద్యార్థులకు కార్పొరేటు స్థాయిలో విద్యాబోధన చేసే ప్రభుత్వ ఉన్నత పాఠశాల దగ్గరలోనే ఉంది. ఈ వసతి గృహాలు జిల్లాకే ఆదర్శంగా ఉన్నాయి.