నందికొట్కూరు - ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గం మరియు నంద్యాల లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. నందికొట్కూరు జనాభా సుమారు 2,03,531 మంది.
కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం 1952 లో ఏర్పడింది. నందికొట్కూరు, పగిడ్యాల, మిడ్తూరు, పాములపాడు మండలాలు ఈ సెగ్మెంట్లో ఉన్నాయి. పక్కనే కృష్ణా నది ప్రవహిస్తున్న తాగు సాగునీటికి కటకటలాడుతున్నారు ఇక్కడి ప్రజలు, శ్రీశైలం డ్యాం బ్యాక్ వాటర్ నియోజకవర్గం సరిహద్దుల వరకు వస్తుంది కానీ నాయకులకు చిత్తశుద్ధి లేక వాటిని ఉపయోగించుకోలేని స్థితి ఉంది. రాయలసీమ జిల్లాలకు ఆధారమైన కేసీ కెనాల్, ఎస్ఆర్బీసీ, తెలుగు గంగ, హంద్రీనీవా ప్రాజెక్టులు ఈ నియోజకవర్గం నుండే ప్రారంభమవుతాయి. వాటి కింద పెద్ద ఎత్తున భూములు కోల్పోయారు స్థానిక రైతులు కానీ ప్రయోజనం మాత్రం లేదు, మేము రోడ్డున పడకుండా కాపాడే బాధ్యత లేదా అని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు బాధితులు.
అలుగునూర్ రిజర్వాయర్ తో పెద్దగా ఉపయోగం ఉండటం లేదు, ఇటీవలే ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేశారు, సాక్షాత్తు ముఖ్యమంత్రి వచ్చి ప్రారంభించిన ప్రాజెక్టు నుండి 30 రోజులకే నీరు రావడం ఆగిపోయిందని రైతుల సంక్షేమం మీద చిత్తశుద్ధి ఇదేనా అని అడుగుతున్నారు. ఇక నందికొట్కూరు పేరుకే టౌన్ అని సౌకర్యాలు పల్లెటూరు కన్నా గోరంగా ఉంటాయని అంటున్నారు స్థానికులు. కనీసం తాగటానికి నీరు, నడవడానికి రోడ్లు, వీధి లైట్లు కూడా లేని కాలనీలో ఎలా ఉండాలని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. ఎన్నికలప్పుడు వచ్చి ఇళ్ల పట్టాలు ఇస్తానని కబుర్లు చెప్తారని తర్వాత వేసుకున్న గుడిసెలను కూడా కూల్చేస్తున్నారని మండిపడుతున్నారు బాధితులు.