ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

ఉత్తరాంధ్ర జిల్లాలలో 10 లక్షల ఉపాధి కల్పనకై కార్యాచరణ ప్రణాళిక

ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం అపారమైన వనరులకు నెలవైన ప్రాంతం. సారవంతమైన భూములు, నిరంతరం ప్రవహించే జీవ నదులు, సువిశాలమైన సముద్రతీరం, శ్రమించే మానవ వనరులు, జీవ వైవిద్యమైన భౌగోళిక, నైసర్గిక స్వరూపం వీటి సొంతం . అయినప్పటికీ ఈ మూడు జిల్లాలు రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడి, అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచి పోవడానికి గల కారణాలను విశ్లేషిస్తే, సంవత్సరాలుగా, తరాలు మారినా, ఈ ప్రాంత అభివృద్ధి పట్ల, ఒకింత నిర్లక్ష్యం, వివక్షత, అనాదిగా కానవస్తున్నది. ఈ పరిస్థితి ఇంకెంతకాలం ఇలాగే కొనసాగుతుంది? ప్రక్కనే నదీ జలాలు ప్రవహిస్తున్న, తాగడానికి గుక్కెడు నీళ్లు లేక, ఉత్తరాంధ్ర ప్రజలు ప్రతి దినం కిలోమీటర్లు కొలది నీటి బిందెలు మోస్తూ, తాగునీటికి సైతం కటకటలాడవలసి వస్తుంది. సాగునీరు లేక భూములు బీడుపడి, వ్యవసాయం గిట్టుబాటు కాక, రైతులు తమ భూములను వదిలి కూలీలుగా, కార్మికులుగా, ఇతర ప్రాంతాలకు వలస పోవలసి వస్తున్నది. ఈ పరిస్థితిని సరిదిద్దడం ఎలా?

స్థానికంగా, ప్రతి జిల్లాలోనూ అందుబాటులో ఉన్న ప్రకృతి వనరులను సద్వినియోగం చేసి, ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే, ఈ వలసలను ఆపడానికి సాధ్యమవుతుంది. కానీ, ఈ విషయంలో స్పష్టమైన కార్యాచరణ అవసరం. దీనికి గత కొంతకాలంగా మేధో మథనం చేసి, స్థానిక వనరులను గురించి వివరాలను క్రోడీకరించి, ఉపాధి అవకాశాల కల్పనకు తగిన పరిశోధన చేసి, ఈ కార్యాచరణను రూపొందించాం. దీనిని నిజం చేసే ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయితే ఉత్తరాంధ్ర జిల్లాలలో ఉపాధికి కొదువ లేదు. ఉత్తరాంధ్ర ప్రజలు కడుపు చేత పట్టుకుని వలస వెళ్లాల్సిన అవసరం లేదు. మేము పొందుపరచిన ఈ క్రింది వివరాలను ఒకసారి పరిశీలిస్తే, మీరు మా అభిప్రాయంతో ఏకీభవించ గలరని మా విశ్వాసం. ఇందులో అవాస్తవాలు ఏమి లేవు. ఈ విషయమై మీ అందరి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని మా కార్యాచరణను ఎప్పటికప్పుడు సమర్థవంతంగా అమలు చేస్తామని హామీ ఇస్తున్నాం.

సంఖ్యఉఫాధి రంగంఉఫాధి కల్పనావకాశాలు ( లక్షలలో)1వ్యవసాయరంగం2 లక్షలు2వ్యవసాయ అదారీత తయారీ రంగం1 లక్ష3ఉద్యాన‌వ‌న పంట‌లు2 లక్షలు4ఉద్యాన‌వ‌న పంటల అదారీత తయారీ రంగం1 లక్ష5మత్స్య పరిశ్రమ2 లక్షలు6పర్యాటక రంగం50 వేలు7అటవీ ఉత్పత్తుల50 వేలు8సేవా రంగం50 వేలు9కుటీర పరిశ్రమలు50 వేలు

ముందుగా వ్యవసాయ రంగం స్థితిగతులను పరిశీలిస్తే, భారతదేశానికి అన్నపూర్ణగా పిలువబడే ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం . ఉత్తరాంధ్ర జిల్లాలలో వరి, చెరకు, జొన్నలు, మిర్చి, పొగాకు, పత్తి, పప్పు దినుసులు అధికంగా పండుతాయి. జిల్లాల్లో నదులు, చెరువుల నుండి ఉరకలెత్తుతున్న నీటిప్రవాహాలద్వారా 200 టీఎంసీల నీటి లభ్యత ఉన్నా, దానికి అడ్డుకట్ట వేసి. పంటపొలాల వైపు మళ్లించే ప్రయత్నమే లేదు. ఇదే ఉత్తరాంధ్ర వెనుకబాటు ప్రధాన కారణం. ఈ ప్రాంత ప్రజలకు కనీసం వంద టీఎంసీల నీళ్లు కూడా అందుబాటులో లేకపోవడంతో, తాగు, సాగు నీటికి కొరతతోపాటు పరిశ్రమలకు కూడా నీటి సరఫరా అంతరాయాలు ఏర్పడుతున్నాయి. విలువైన జీవాధారమైన నీరు వృధాగా సముద్రం పాలవుతున్నది.

ఉత్త‌రాంద్ర‌ జిల్లాలలో వ్య‌వ‌సాయం, ఉద్యాన‌వ‌న పంట‌లు, తోట‌ల‌ పెంప‌కం, అడ‌వుల‌లో పెరిగే ఔష‌ధ మొక్క‌లు పెంప‌కం పుష్క‌లంగా ఉన్నాయి. ఉత్తరాంధ్ర అందుబాటులో ఉన్న నీటి నుండి కేవలం 80 టీఎంసీలు మూడు జిల్లాలకు అందించడం ద్వారా దాదాపు 30 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడంతోపాటు కొన్ని వందల గ్రామాలకు తాగునీటి ఇబ్బందిలేకుండా సరఫరా చేయొచ్చు. స్థానికంగా ఉన్న చెరువులకు, గెడ్డలు మరమత్తులు చేసి, చిన్న తరహా ఎత్తి పోతల పధకాల ద్వారా కూడా వేల ఎకరాల భూములను సాగులోకి తేవచ్చు. దీనికై కోట్ల రూపాయల పెట్టుబడి అవసరం లేదు. అలాగే, సంవత్సరాలుగా పూర్తికాని నీటిపారుదల ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తే, లక్షల ఎకరాలకు కొత్తగా నీరందించవచ్చు. ఒక్క వ్యవసాయరంగంలోనే 2 లక్షల మంది ప్రజలకు జీవనోఫాది కల్పించి, బతుకుపై భరోసా కల్పించవచ్చు. వ్యవసాయ పంటల ఆధారిత, తయారీ రంగ పరిశ్రమల ద్వారా మరో 2 లక్షల మంది ప్రజలకు ఉఫాధి కల్పించి, కొన్ని వేల కోట్ల పంట ఉత్పత్తి చేయవచ్చు. దీని వలన వలసలు ఆగిపోతాయి. ప్రజల జీవనప్రమాణాలు మెరుగుపడతాయి. సహజసిద్ధంగా ప్రకృతి ప్రసాదించిన వనరులన్నీ నిరుపయోగమై, జనజీవనం అస్తవ్యస్తమైన ఉత్తరాంధ్ర అభివృద్ధిపథంలోకి రావాలంటే యుద్ధప్రాతిపదికన సాగునీటి ప్రాజెక్టులు చేపట్టి పూర్తి చేయాలి.

ఉత్తరాంధ్ర జిల్లాలు ఉద్యాన పంటలకు అనువైన ప్రాంతం. ఈ మూడు జిల్లాలలో అరటి, కొబ్బరి, జీడీ పప్పు, పనస, మునగ, పైన్ యాఫిల్ , కాపీ వంటి వాణిజ్య మరియు సముద్ర తీర, ఉద్యాన పంటలు పండుతాయి. కానీ, ఉత్పత్తి చేసిన పంటలను సకాలంలో అమ్మలేక, నిలువ చేయడానికి తగినన్ని శీతల గిడ్డంగులు లేక పంట నాశనం అవడంతో రైతులు విపరీతంగా నష్టపోతున్నారు. స్థానిక మరియు ప్రపంచ మార్కెట్లను వృద్ధి చేయడానికి అవసరమైన నీటిపారుదల, నిల్వ, ప్రాసెసింగ్ మరియు రవాణాను ప్రభుత్వం బలోపేతం చేయాలి. ఉత్పత్తి, సేకరణ, ప్రాసెసింగ్, ట్రేడింగ్, నిర్వహణ, మార్కెట్టింగ్ మరియు పంపిణీలో వేల సంఖ్యలో ఈ రంగం ఉపాధి కల్పించ కలదు. సమర్థవంతమైన విధానాలు అమలు పరిస్తే ,ఉత్పత్తి మరియు అమ్మకాలు మెరుగు పడుతుంది. ప్రభుత్వం 1000 కోట్ల పెట్టుబడి చేస్తే, కనీసం 2లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉఫాధి అవకాశాలు కల్పించవచ్చు.

ఉద్యాన‌వ‌న పంటల అదారీత తయారీ రంగం ప్రోత్సహించడం ద్వారా, జీడీ పప్పు ప్రాసెస్సింగ్, కొబ్బరి పీచు నుండి తాళ్లు, కార్పెట్లు, జనపనార నుండి పర్యావరణ హితమైన సంచులు, దుస్తులు, కొబ్బరి, పనస, మునగ మరియు అరటి పంట ఆధారిత తయారీ రంగ పరిశ్రమల ద్వారా ఆహార పదార్దాలే కాక వీటి సంబంధిత రంగాలైన హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, ఫుడ్ ప్రాసెస్సింగ్ సంస్థలద్వారా మరో 2 లక్షల ఉద్యోగాలు కల్పించవచ్చు.

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలలో, 4 రాయల సీమ జిల్లాలు మినహాయిస్తే, మిగతా 9 జిల్లాలు సముద్రతీరం కలిగివున్నాయి. దీనిలో 40 శాతం పైగా తీరప్రాంతం 3 ఉత్తరాంధ్ర జిల్లాలోనే ఉండటం విశేషం. సముద్రపు ఇసుకలో నిక్షిప్తమైన అపార ఖనిజ సంపదతో బాటు, ఉత్తరాంధ్ర సముద్ర జలాలతో అరుదైన మత్స్య సంపద లభ్యమౌతున్నది. ఇంతే కాకుండా సముద్రంలో దొరికే నాచు నుండి పోషక విలువలతో కూడిన ఫుడ్ సప్లిమెంట్ తయారీ ప్రోత్సహించవచ్చు. సముద్ర ప్రాంతంలో ఆక్వా పరిశ్రమ అభివృద్ధి ద్వారా చేపల పెంపకం , సముద్రపు చేపల నుండి తాజా, మరియుు యొండు చేపల ఎగుమతి, ఉప్పు పరిశ్రమ, ఖనిజ పరిశ్రమలను ప్రోత్సహించటం ద్వారా, కనీసం 2 లక్షల మందికి ఉఫాధి కల్పించవచ్చు.

ప్రకృతి అందాలకు, ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలకు, విశాలమైన సముద్రతీరం, తూర్పు కనుమలు, నదీ పరివాహక ప్రాంతం వంటి అనేక సుందరమైన ప్రదేశాలకు నెలవైన ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం విశాఖపట్టణం మరియు విజయనగరం జిల్లాలలో పర్యాటక అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి.

ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యాటకరంగాన్ని ప్రకృతి పర్యాటకం, బౌద్ధ పర్యాటకం, పుణ్యక్షేత్రాల పర్యాటకం, చారిత్రిక పర్యాటకం, సముద్ర తీరా పర్యాటకంగా విభజించవచ్చు. అరకు, పాడేరు , లంబసింగి వంటి ఎత్తైన కొండ ప్రాంతాలు అతిసుందరమైన ప్రకృతికి పుట్టినిల్లు. ఈ ప్రాంతంలో నివసించే అమాయకులైన గిరి పుత్రులు ఈ ప్రకృతి సౌందర్యానికి తమ సంస్కృతి, వారసత్వంతో మరింత ప్రాశస్త్యాన్ని చేకూరుస్తారు. ఈ అడవులలో, పర్వత పాణువులలో అందమైన జంతువులూ, పక్షులు, జలపాతాలతో బాటు అరుదైన మూలికలు దొరుకుతున్నాయి. గిరిజన ప్రాంత, కొండ ప్రదేశాలలో మౌలిక వసతులు కల్పిస్తే, పర్యాటకానికి దేశ విదేశాలనుండి విశేష స్పందన ఉంటుంది. విశాఖలోని బొర్రా గుహలు, కాపీ తోటలు ఆడుబితమైన పర్యాటక ప్రాంతాలు.

ఇక ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన అరసవెల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి. విజయనగరంలో పైడితల్లి అమ్మవారు, విశాఖపట్నంలో అన్నవరం, సింహాచలం చెప్పుకోదగ్గ పర్యాటక ప్రదేశాలు. పుణ్యక్షేత్రాలన్నిటిని కలుపుతూ ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి తగిన హోటళ్లు, రోడ్లు, మంచినీరు, రవాణా మరియు పారిశుద్ధ్యం మెరుగు పరిస్తే ప్రత్యక్ష, పరోక్ష రంగాల ద్వారా ఉఫాధి పెంపొందించవచ్చు. ప్రసిద్ధ బౌద్దారామలైన శాలిహుండం, తాటికొండ, బావికొండ, బొజ్జన్నకొండలో గల బౌద్ధ ఆరామ క్షేత్రాలను కలుపుతూ, ఆ క్షేత్రాల అభివృద్ధి ద్వారా ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించవచ్చు. పైన వివరించిన పర్యాటక ప్రదేశాలను వీక్షించడానికి, సందర్శకులను ఆకర్షించడానికి, తగిన రహదారులు, రైలు మార్గాలు, విమాన మార్గాలు, హోటల్లు, రెస్టా రెంట్లు, ఇంటర్నెట్ సదుపాయం, వైద్య సదుపాయాలు, మౌలిక సదుపాయాలు. వసతులు కల్పన, నిర్వహణ ఇంకా సంరక్షణలో సుమారు 50,000 కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టించవచ్చు.

చివరగా, సేవారంగం అభివృద్ధి ద్వారా, కుటీర పరిశ్రమలను నెలకొల్పేందుకు తగిన ప్రోత్సాహకాలందించడం ద్వారా మరో లక్ష మందికి ఉఫాధి అవకాశాలు సృష్టించవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా మత్స్య, పర్యాటక రంగ అభివృద్ధిపైనే నివసించే దేశాలున్నాయి. అన్ని వనరులున్న ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంకల్పసిద్ధి, పెట్టుబడి, ప్రణాళికా సరైన కార్యాచరణ అవసరం. గత 30 ఏళ్లలో కనీసం 20 లక్షలకు పైగా ప్రజలు జీవనోఫాది లేక వలసపోయారు. వాళ్ళ బతుకులు ఛిద్రమై పోయాయి. కనీసం ఇప్పటికైనా సరైన ఉఫాధికల్పనకు సరైన చర్యలు తీసుకోకుంటే, మరో పదేళ్లలో ఉత్తరాంధ్ర ఎడారిగా మారిపోతుంది. ఉత్తరాంధ్ర ప్రజల భవితకు ఉఫాధికల్పన ద్వారా భరోసానిద్దాం. భావితరాలకు బతుకుపై ఆశ కల్పిద్దాం.

Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి