శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇచ్ఛాపురం మండలము చెన్నై, కోల్ కతా జాతీయ రహదారిపై ఉంది. ఒడిషా వైపునుండి వచ్చేటపుడు ఆంధ్ర ప్రదేశ్లో మొట్టమొదటి పట్టణం ఇచ్ఛాపురము. అందు చేత, ఇచ్ఛాపురమును ఆంధ్ర ప్రదేశ్ కు ఈశాన్య ముఖద్వారంగా చెప్పవచ్చు.
2011 జనాభా లెక్కల ప్రకారం, ఇచ్ఛాపురం జనాభా 88965. అందులో 42958 మంది పురుషులు, 46607 మంది మహిళలు ఉన్నారు. ఇచ్ఛాపురం అక్షరాస్యత 55.95%. ఆంధ్ర - ఒరిస్సా సరిహద్దు పట్టణమైన ఇఛ్చాపురం అపరిశుభ్రతకు మారుపేరుగా మారింది. ఈ ప్రాంతంలో తొలగించిన చెత్త ను పారవేసి డంపింగ్ యార్డ్ లేకపోవడంతో, రహదారి పొడుగునా దుర్గంధం వెదజల్లే చెత్త ఈ ప్రాంతవాసుల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఇఛ్చాపురం, కవిటి, సోంపేట ఇంకా కంచిలి మండలాలతో పాటు, ఇచ్ఛాపురం మునిసిపాలిటీ కూడా ఇఛ్చాపురం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉంది. ఈ నాలుగు మండలాలనుండి కనీసం 18 గ్రామాలు సముద్ర తీరంలో ఉన్నాయి. కొబ్బరి, జీడీ రైతులతోబాటు, మత్స్యకారులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంత వాసులు కొబ్బరినుండి స్థిరమైన ఆదాయం పొందేవిధంగా ధరలు స్థిరీకరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మత్స్యకారులు సముద్రతీరంలో జెట్టి మరియు శీతల గిడ్డంగి నిర్మిస్తే ఆదాయం పెరుగుతుందని ఎదురుచూస్తున్నారు.
ఈ ప్రాంతంలో భారీ పరిశ్రమలేవి లేకపోవడంతో అధిక శాతం (80% కి పైగా) యూవత గల్ఫ్ దేశాలకు వలసలు వెళ్లిపోతున్నారు. వీరిలో ఎక్కువ శాతం మంది అనేక కష్టాలకు, మోసాలకు గురౌతున్నారు. ఉద్దానం అంటేనే కొబ్బరి తోటలు, పచ్చదనం మాత్రమే కాకుండా, కిడ్నీ వ్యాధులకు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. ఒక్క ఇచ్ఛాపురం లోనే 7 వేల మంది రోగులు డయాలిసిస్ చేయించుకునే దశలో ఉన్నారు. ఇటీవలే ప్రభుత్వం ఇచ్ఛాపురంలో డయాలిసిస్ సెంటర్ను ప్రారంభించింది. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో శుద్ధి చేసిన మంచినీరు ఉచితంగా అందించడంతో బాటు 2500 రూపాయలు పింఛనుగా అందిస్తున్నది.. బహుదా, మహేంద్రతనయ నదులపై పై వంతెనలు నిర్మించి, సాగు, తాగునీటి కష్టాలను రూపుమాపాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు, మరుగు దొడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలూ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.