శారదా నది ఒడ్డునే ఉన్న అనకాపల్లి పట్టణం జిల్లా కేంద్రమైన విశాఖపట్టణానికి కేవలం 29 కిలోమీటర్ల దూరం లో ఉంది. సముద్ర మట్టానికి 95 అడుగుల ఎత్తులో ఉన్న అనకాపల్లి సహజంగా తీరప్రాంత వాతావరణం తో బాటు, శీతాకాలం లో ఆహ్లాదకరమైన చల్లని వాతావరణాన్ని కలిగిఉంటుంది. 1878 లోనే మునిసిపాలిటీగా అవతరించిన అనకాపల్లి 2013 వ సంవత్స్రం లో విశాఖ మహానగర పాలక సంస్థలో విలీనమయ్యింది. పార్లమెంటరీ మరియు రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గం గా వ్యవహరిస్తున్న అనకాపల్లి ఆంధ్ర రాష్ట్రములో ప్రసిద్ధ వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులకు అనువైన పట్టణంగా పేరొందినది. దేశంలోనే రెండవ అతిపెద్ద ‘బెల్లం’ తయారీ, విక్రయ విపణి అనకాపల్లి లో కేంద్రీకృతమై ఉన్నది. కాసింకోట,ఇంకా అనకాపల్లి మండలాలు ఈ అసెంబ్లీ పరిధిలోనివే. 2011 జనాభా లెక్కల ఆధారంగా, అనకాపల్లి మునిసిపల్ పట్టణ జనాభా 86,519. వీరిలో 43,100 మంది పురుషులుంటే, 43419 స్త్రీలతో సమానమైన స్త్రీ, పురుష నిష్పత్తి కలిగి ఉంది. 67 శాతం అక్షరాస్యులు గల ఈ నియోజకవర్గం లో మగవారి లో 54శాతం మంది చదువుకోగా, మహిళల్లో 46శాతం మంది మాత్రమే చదువుకున్నారు. మహిళల విద్య అధికంగా ఉన్న రాష్ట్రాలు, ప్రాంతాలు అభివృద్దికి దగ్గరగా ఉంటాయనే విషయం ప్రత్యక్షం గా తెలిసిందే. గ్రామీణ ప్రాంతాలలోని అమ్మాయిలు ప్రాథమిక విద్య దశను దాటి, హైస్కూల్కు పోవాలంటే, బాలికల ఉన్నత పాఠశాలలు వారి ఇండ్లకు దగ్గరగా ఉంటేనే, అది సాధ్యపడుతుంది. ‘ఆడపిల్లలను కాపాడండి, ఆడపిల్లలను చదివించండి అనే నినాదం నిజమవ్వాలంటే, బాలికల విద్యకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయాలని డిమాండు చాలాకాలం గా ఉంది. దీనివలన ఈ ప్రాంతం పిల్లలు కేంద్ర విద్యా సంస్థలలో కూడా ఉన్నత చదువులకై ప్రవేశం పొందగలరు. ఈ ప్రాంతపు యువతకు సరైన ఉఫాధి లేక, నిరుద్యోగం ప్రధాన సమస్యగా మారింది. వీరికి ప్రత్యేక ఉఫాధి, నైపుణ్య శిక్షణా కేంద్రాలు అవసరం. ఆధునిక మార్కెట్ అవసరాలకు అనువైన నైపుణ్యాలు వీరికి కల్పించాలంటే ఐటీ, ఫుడ్ ప్రాసెస్సింగ్, మార్కెటింగ్, ఇంకా, స్వయం ఉఫాధి పొందే పరిశ్రమల స్థాపనకు అవసరమైన శిక్షణ పై దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది.
ఇక అనకాపల్లి ఆర్థిక వ్యవస్థ కు జీవనాడి వంటి వ్యవసాయం విషయానికి వద్దాం. చెరుకు ఇక్కడి ప్రధాన వాణిజ్య పంట. పూర్తిగా వ్యవసాయం పైనే బతుకుతున్న ఇక్కడకి ప్రజలు వరి, జొన్నలు, చెరుకును అధికంగా పండిస్తున్నారు. చెరకు దిగుబడిని ఆసరాగా చేసుకుని ఏర్పడిన బెల్లం తయారీ పరిశ్రమ ఇక్కడి ప్రజలకు ప్రధాన జీవనోపాధి గా మారింది. దేశంలోనే రెండవ అతిపెద్ద బెల్లం మార్కెట్ గా ప్రసిద్ధి పొందిన అనకాపల్లి బెల్లం మార్కెట్ ప్రస్తుతం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర్రాల నుండి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నది.. గత కొంత కాలం గా ఈ ప్రాంతపు రైతులు తక్కువ పంట దిగుబడి వలన మార్కెట్ డిమాండ్ కి అనుగుణం గా స్పందిచలేక పోతున్నారు. నీటి లభ్యత చెరకు పంట దిగుబడిని ప్రభావితం చేస్తుంది. సరైన దిగుబడి లేని చెరకు పంట కారణంగా ఈ ప్రాంతం లో తయారయ్యే బెల్లం దర అధికంగా ఉంటోంది. సంవత్సారాలుగా బీహార్. పశ్శిమ బెంగాల్ ఇంకా ఒరిస్సా ప్రాంతాలకు అవసరమైన బెల్లం అనకాపల్లి మార్కెట్ నుండి సరఫరా అయ్యేది. కాని ప్రస్తుతం అనకాపల్లి కంటే తక్కువ ధర లో, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లలో తయారయ్యే బెల్లానికి డిమాండ్ పెరగడం వల్ల స్థానిక రైతులు నష్టపోతున్నారు. ఇక్కడి రైతులను బలోపేతం చేయాలంటే జిల్లాలో స్థానికంగా ఉన్న నీటి వనరుల అభివృద్ధితో పాటు, దీర్ఘకాల సాగు నీటి అభివృద్ధి పై దృష్టి సారించాలి. ఇంతే కాకుండా, రైతులకు సులభ మరియు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై శిక్షణ అవసరం. పండించిన పంటలకు సరియైన ధరలు వచ్చేవరకు నిల్వ చేయాలంటే సరిపడినన్ని గిడ్డంగులు అవసరం అప్పుడే రైతు పెట్టిన పెట్టుబడి కి న్యాయం చేకూరుతుంది. రైతులు అప్పులబారిన పడి ఆత్మహత్యలకు లోనవకుండా జీవనం సాగిస్తారు. లేకుంటే రైతులు కూలీలుగా మారి, వ్యవసాయానికి దూరమౌతారు. దేశానికే అన్నపూర్ణ ఐన ఆంధ్ర ప్రదేశ్, తిండిగింజలకు కూడా విదేశాలు లేదా ఇతర రాష్ట్రాలపై ఆధారపడవలసి వస్తుంది. ఇక్కడి ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస పోయి బానిసలుగాబతుకుతున్నారు. వ్యవసాయం మన రాష్ట్ర సంస్కృతిలో ఒక భాగం. సాగు తప్ప వేరే పని తెలియని రైతు వ్యవసాయానికి దూరమైతే తన ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతాడు. ఆత్మాభిమాభిమానానికి పెట్టింది పేరుగా ఉండే రైతు కుమిలిపోతాడు. మహారాష్ట్ర , రాజస్థాన్, హర్యానా రైతులనుండి మనరైతులు ఈ విషయం లో చాలా నేర్చుకోవాలి. సమిష్టిగా ఉంటూ, దీటుగా పోరాడే బలమైన రైతు నాయకులు మనకు కావాలి. ఏ రాజకీయ పార్టీనైనా గట్టిగా ప్రశ్నించి, తమ ప్రధాన సమస్యలను తీర్చుకోగల సామర్థ్యం వీరికి పెరగాలి.
అనకాపల్లి ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరం లో ఉండడానికి దశాబ్దాలుగా నలుగుతూన్న కొన్ని సమస్యలే కారణం. మారుమూల ప్రాంతాలు సరియైన రహదారులు లేక అభివృద్ధికి దూరంగా ఉంటున్నాయి. ముఖ్యంగా, సబ్బవరం మండలం లోని అరిపాక దగ్గర బి. యెన్ రోడ్ నుండి భువనేశ్వరి మాతా ఆలయం వరకు దారులు నిర్మించాలని ఇక్కడి ప్రజల కోరిక. ఇది ఆటవీ ప్రాంత ప్రజలను కుడా ప్రధాన స్రవంతిలో కలుపుతుందని ఆశిస్తున్నారు. త్రాగు నీరు, భూగర్భ డ్రైనేజీ, పాడిశుద్ద్యం ఇక్కడి ప్రధాన సమస్యలు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి.తగిన ప్రోత్సహం యిచ్చి, బహిరంగ మలవిసర్జన చేసే అలవాటును మాన్పించవచ్చు .చింతపల్లి-నర్సీపట్నం-చోడవరం-సబ్బవరం, మరియు ఆనందపురం ల మధ్య వెళ్లే రాష్ట్ర హైవే ను జాతీయ రహదారిగా మార్చాలనే ఈ ప్రాంత వాసుల చిరకాల కోరిక తీరడానికి ఇంకెంతకాలం పడుతుందో వేచి చూడాల్సిందే.
అనకాపల్లి లోని శంకరం గ్రామ పంచాయతీ పరిధిలోని బొజ్జన్నకొండ క్రీస్తుపూర్వం 20వ శతాబ్దంలోనే ప్రసిద్ధ బౌద్దారామంగా వెలిసింది. దేశ విదేశాలనుండి సందర్శకులు వచ్చే ఈ చారిత్రక సంపద గత 30 సంవత్సరాలుగా ఆధరణలేక, శిథిలావస్థకు చేరింది. బొజ్జన్నకొండ అభివృద్ధికి ఇటీవల రూ.7.32 కోట్లు మంజూరయ్యాయి. కేంద్ర ప్రభుత్వం రూ.7.32 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో బౌద్ధ, ధ్యాన మందిరాలు, పార్కింగ్, విద్యుత్తు, సీసీ టీవీ, మరుగుదొడ్లు, స్టాల్స్, పచ్చదనం, బౌద్ధ సర్క్యూట్, సౌండ్ సిస్టమ్స్ వంటి సౌకర్యాలు కల్పిస్తామని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ప్రకటించారు.