జిల్లా కేంద్రమైన విశాఖ నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంగా, మండలకేంద్రంగా, వ్యవహరిస్తున్నది. సముద్ర మట్టానికి 58 మీటర్ల ఎత్తులో ఉన్న నర్సీపట్నంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 91 612 మంది నివసిస్తున్నారు. వీరిలో 16,076 (49%) మంది మగవారు కాగా, 17,681 (51%) మంది మహిళలున్నారు. ఇక్కడ ప్రతి 1100 స్త్రీలకు 1000 మంది పురుషులున్నందున, జనాభాలో మహిళల శాతం ఎక్కువగా ఉంది. 44,140 మంది, అంటే దాదాపుగా 50% మంది ప్రజలకు ఉద్యోగ, ఉఫాధి అవకాశాలు లభించినప్పటికీ, మహిళలకు మాత్రం తగినన్ని అవకాశాలు లేవు. 78 శాతం అక్షరాస్యులతో, నర్సీపట్నం జాతీయ అక్షరాస్య్లుల సగటుకంటే ఎక్కువ మంది చదువుకున్నవారు ఉన్న పట్టణంగా చెప్పవచ్చు. సాలీనా 1208 మిల్లీ మీటర్ల వర్షంతో, 27.4 °C. తలసరి ఉష్ణోగ్రతతో, నర్సీపట్నం ఉష్ణమండల వాతావరణాన్ని పోలి ఉంటుంది కాబట్టి ఇక్కడ , వేసవికాలంలో ఎక్కువగా వర్షం కురుస్తుంది.
2012వ సంవత్సరంలోనే అతిపెద్ద పంచాయితిగా ఉన్న నర్సీపట్నాన్నీ పురపాలకసంస్థ పరిధిలోకి తెచ్చారు. కానీ, నర్సీపట్నం గత 5 ఏళ్లలో ప్రాధమికంగా ఈ విధమైన మార్పుకు నోచుకోలేదు. పంచాయితిగా ఉన్నప్పటి మట్టి రోడ్లు, మురికి వాడలు , వర్షాకాలంలో పొంగి, పొర్లే డ్రైనేజీలు, శివార్లలో పేరుకుపోయిన చెత్త, వాటిచుట్టూ ఆనందంగా తిరిగే పందులతో వర్థిల్లుతుందంటే, ఈ పట్నంపై ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైనవారికి ఎంత ప్రేమ ఉందొ అర్థం చేసుకోవచ్చు. పురపాలక సంస్థలో విధులు నిర్వహించటానికి తగినంత పారిశుద్ధ్యం సిబ్బందిలేరు. దీంతో, ఈ ప్రాంతంలో పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసింది. మౌలిక వసతులైన రోడ్లు, తాగునీరు, ఇంకా పారిశుద్ధం పూర్తిగా లోపించినప్పటికీ, పురపాలకసంస్థ పరిధిలో చేరినందున నర్సీపట్నం వాసులకు పన్నులు మాత్రం పెరిగాయి. పట్టణంలో అతితీవ్రమైన తాగునీరు సమస్యను యుద్ధప్రాతిపదికన తీర్చవలసి ఉంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని 13జిల్లాలలో కనీసం 11 జిల్లాల్లో భూగర్భజలాలు కలుషితం అయ్యాయని కేంద్ర జలవనరుల సహాయ మంత్రివర్యులు ఇటీవలే లోకసభలో వెల్లడించారు. విశాఖపట్నం పరిధిలోని అన్ని మండలాలలో భూగర్భ జలాలలో ప్లోరైడ్, నైట్రిట్, ఇనుము, ఇంకా హానికర రసాయనాల శాతం అనుమతించబడిన దానికంటే ఎక్కువగా ఉన్నందున, ప్రజలకు దంత, కిడ్నీ, హృద్రోగ వ్యాధులు అధికంగా వస్త్తాయని వెల్లడించారు. నర్సీపట్నం పురపాలక పరిధిలోని కుళాయిలలో మురుగునీరు సరఫరా అవుతున్నది. నీరుశుద్ది చేసే ప్లాంట్ల ఏర్పాటు అత్యవసరం. దీనితోబాటు, పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచి, ప్రజారోగ్యాన్ని సంరక్షించాల్సిన బాధ్యత పురపాలక సంస్థదే.
ప్రాధమిక రవాణా అవసరాలైన బస్సులు కూడా లేని గ్రామాలు నర్సీపట్నం పరిధిలో కోకొల్లలు. పల్లెలనుండి పట్టణాలకు వలసలు అధికంగా ఉంటున్న ఈ ప్రాంత యువతకు తగినన్ని విద్య, ఉఫాధి సౌకర్యాలు లేవు. నైపుణ్యాలు పెంచే వీలుగా ఐఐటీ , నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు అవసరం.
పారిశ్రామికంగా వెనుకబడిన నర్సీపట్నంలో స్థానికంగా దొరికే రంగురాళ్ల, తవ్వకం, నగిషీలు అద్దె పరిశ్రమ అభివృద్ధి ద్వారా ఉఫాధి కల్పించవచ్చు. తరాలుగా జీడీ పప్పు పిక్కల పరిశ్రమలలో పనిచేసే కార్మికులు శ్వాసకోశ, చర్మ సంబంధిత, గర్భకోశ వ్యాధులతో అవస్థలు పడుతున్నారు. వీరి ఆరోగ్య పరిరక్షణకు తగు చర్యలు అవసరం. ఈ మున్సిపాలిటీ పరిధిలోగల కోటవురట్ల, వాతావరం ప్రాంతాలలో కూడా రహదారులు, మంచినీరు, పారిశుద్యం ప్రధాన సమస్యలు. గిరిజన ప్రాంతాలకు బస్సు సౌకర్యం లేదు. అనాదిగా ఈ ప్రాంతానికి మంచినీరు అందించే తాండవ జలాశయానికి పూడికలు తీసి దశాబ్దాలు గడుస్తున్నాయి. తాండవజలాశయానికి మరమ్మత్తులు చేసి పూడికతీస్తే, స్వచ్చ మైన నీళ్లు అందించవచ్చు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇంకా ఇతర బహిరంగ ప్రదేశాలలో మరుగుదొడ్లు కల్పించాలి. ప్రజలలో పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించితే, పారిశుధ్య సమస్యను కొంతవరకు తీర్చవచ్చు. డ్రైనేజీలు, మురికి కాలువల పూడిక తీయడం, చెత్తను నిర్ములించటం వంటివి పురపాలకసంస్థ చేపట్టాల్సిందే. లేకుంటే, నర్సీపట్నం మురికికూపంగా మారుతుంది. నర్సీపట్నం అభివృద్ధికి అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాలు, పత్రికలూ, సామాన్య పౌరులు అందరు కలిసి సమిష్టిగా శుభ్రమైన, స్వచ్ఛమైన పట్నంగా తయారుచేయాల్సిన అవసరం ఉంది.