విశాఖ మన్యం లో పాడేరు. మండల కేంద్రంగా, అసెంబ్లీ నియోజకవర్గంగా, ఏజెన్సీ ప్రాంతంలో అతిముఖ్యమైనపట్టణంగా ప్రసిద్ధి పొందింది. సముద్ర మట్టానికి దాదాపుగా 2,694 అడుగుల ఎత్తులో ఉన్న పాడేరు, షెడ్యూలు తెగలకై రిజర్వు చేసిన నియోజకవర్గం. 2011 జనాభా లెక్కల ప్రకారం పాడేరు పట్టణం లో 58,983 మంది నివసిస్తున్నారు. వీరిలో 86 శాతం మంది గ్రామీణ ప్రాంతాలలో ఉంటె, కేవలం 14 శాతం మాత్రమే పట్టణాలలో ఉన్నారు. 60 శాతం అక్షరాస్యతతో, ఈ నియోజకవర్గంలో 31,274 మంది మాత్రమే చదువుకున్నవారు. 49 శాతం మంది మగవారు, 51 శాతం స్త్రీలతో, పాడేరు పట్టణపు లింగనిష్పత్తిలో మహిళలదే పైచేయి. కాని , 31,461 మంది సంపాదనపరులున్న ఈప్రాంత జనాభాలో 48 శాతం మంది మహిళలకు మాత్రమే ఉఫాధి అవకాశాలు లభిస్తుంటే, 52 శాతం మంది మగవారు ఉఫాధి అవకాశాలు పొందుతున్నారు. అక్షరాస్యతలో, సంపాదనలో మగవారిది పైచెయ్యి. కేవలం 43 శాతం మహిళా అక్షరాస్యతతో, పాడేరు మన్యం విద్యా, వైద్య, ఉఫాధి అవకాశాల కల్పనలో వెనుకబడి ఉంది. అందుకే అభివృద్ధి సూచిలో పాడేరు వెనుకబడిఉంది. ఆహ్లాదకరమైన పాడేరులో కొండలు, ఏజెన్సీ ప్రాంతాలు సహజమైన ప్రకృతి అందాలతో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా పేరుపొందింది.
అపారమైన ఖనిజసంపదలున్న ఈ జిల్లాలో, ఆ ఖనిజాల తవ్వకం, శుద్ది, ఇంకా అమ్మకం వంటివి అసాధ్యం. ఈ ప్రాంతపు గిరిజనులు బాక్సయిట్ గనుల తవ్వకానికి వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా బహుళజాతి సంస్థలు ఇక్కడి విలువైన ఖనిజ సంపదను కొల్లగొట్టి, దోచుకోవడం తప్పితే, ఈ పరిశ్రమల స్థాపనవల్ల స్థానికులకు ఉపయోగం ఉండక పోగా, ఇక్కడి వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. కనీస వైద్య అవసరాలు కూడా లేని ఏజెన్సీ ప్రాంతాలలో ఈ పరిశ్రమల కాలుష్యం తోడైతే వీరి పరిస్థితి మరింత దుర్లభం అవుతుంది. షెడ్యూల్డ్ తెగలు అధికంగా ఉన్న పాడేరు ఏజెన్సీ ప్రాంతం కనీస తాగునీటి అవసారాలకు కూడా నోచుకోలేదు. నీటికోసం కనీసం 5 కిలోమీటర్లు నడిచే ఇక్కడి కుటుంబాలు కలుషితమైన కుంటలు, చెరువు నీటిపై ఆధారపడుతున్నాయి. మారుమూల పల్లె ప్రాంతాలలో దాదాపు 70 శాతం ప్రజలకు సురక్షిత మంచి నీళ్లు అందుబాటులో లేదు. మంచినీటి సమస్య వర్షాకాలంలో కూడా ఇక్కడ తీవ్రంగానే ఉంటుంది. దీనికి కారణం అందుబాటులో ఉన్న బోరుబావులు కూడా పని చేయకపోవడమే. 1200 ఓపెన్ బావులలో 60శాతం బావులు నీళ్లు లేక ఎండిపోయాయి. 3090 గొట్టపు బావులలో 50 శాతం పనిచెయ్యడం లేదు. ఫలితంగా, ఇక్కడిప్రజలు కలుషితమైన చెరువు నీళ్లనే మంచినీటి అవసరాలకు కూడా వాడుకోవలసి వస్తుంది. ఎన్టీఆర్ సుజల స్రవంతి పధకం ద్వారా 1,228 కుటుంబాలకు (2 పంచాయితీలకు) మాత్రమే శుద్ధి చేసిన మంచినీరు దొరుకుతున్నది. మిగిలిన 3,759 కుటుంబాలు నీటి ఎద్దడికి లోనవుతున్నాయి.
అధికశాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నందున వీరు వ్యవసాయం, ఆటవీ ప్రాంత ఉత్త్పత్తులపై ఆధారపడి జీవనం సాగించాల్సి వస్తుంది. సేకరించిన ఆటవీ ఉత్తత్తులకు సరైన మార్కెటింగ్ సదుపాయాలూ లేకపోవడంతో గిరిజనులు దోపిడీకి గురౌతున్నారు. గిరిజన ఉత్త్పత్తి ఆధారిత పరిశ్రమలు నెలకొల్పితే వీరి ఉఫాధి అవకాశాలు మెరుగు పడుతాయి. కల్తీ విత్తనాలు, వడ్డీవ్యాపారుల బెడద, నిస్సారవంతమైన భూములు, అందని ప్రభుత్వ పధకాలు, ఇన్సూరెన్స్ సదుపాయాలూ ఇంకా మార్కెటింగ్ వసతులు లేని గిరిజనుల వ్యవసాయం వారిలో పేదరికాన్ని, నిస్సహాయతను మాత్రమే మిగులుస్తున్నాయి. పధకాలు వీరిదగ్గరకు చేరుస్తూ, మెరుగైన పనిముట్లు, విత్తనాలు సాగు పద్దతులను అందించే సమన్వయ సంస్థలు ఇక్కడ చాలా అవసరం. ఆధునిక సమాజానికి దూరంగా బతికే గిరిజన సంప్రాదాయాలు, సంస్కృతులను, నగరాలలో ఇంకా , పట్టణాలలో నివసించే వాళ్ళు పూర్తిగా అర్ధం చేసుకోలేరు కాబట్టి, కొండ ప్రాంతపు తెగల సంస్కృతీ, ఆచారాలను గౌరవించే సమన్వయ సంస్థలు అవసరం.
అక్షరాస్యత తక్కువగా ఉండడం మూలాన ఈ తెగలు అనాదిగా దోపిడీకి గురౌతున్నారు. ఇక్కడ ప్రాధమిక విద్యావకాశాలు కుడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఆశ్రమ పాఠశాలల మాదిరి గిరిజన ప్రాంతపు పాఠశాలలకు భోజనం, వైద్యం, వసతిసౌకర్యాలు కల్పించి, ఇక్కడి పిల్లలను విద్యావంతులుగా చేయాలి. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు, టీచర్లు, వైద్యుల కొరతను ఎదుర్కొంటున్నది. ఉన్న సిబ్బంది కూడా మారుమూల ప్రాంతాలలో పనిచేయడానికి ఇష్టపడటం లేదు. ప్రభుత్వ పాఠశాలల మరియు ఆసుపత్రుల సిబ్బంది కనీసం 3 సంవత్సరాలు తప్పనిసరయి ఈ ప్రాంతాలలో విద్యా, వైద్య సేవలను అందించే విధంగా చట్టసవరణ చేయాలి. హాస్టల్స్ ల్లో వార్డెన్లు లేరు. అందుబాటులో ఉన్న ఆశ్రమ పాఠశాలల్లో తగిన సదుపాయాలు కొరవడ్డాయి. దీనివలన విద్యా, వైద్య రంగాలలో ఈ ప్రాంతం పూర్తిగా వెనుకబడిఉంది. కేంద్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఇక్కడి ప్రజలతో సమన్వయంతో పనిచేయడం లేదని అనేక గిరిజన గ్రామాల ప్రజలు ఆక్షేపిస్తూన్నారు. ఈ దశలో విద్యా, వైద్యా సదుపాయాలూ మెరుగుపరచి, గిరిజనేతరుల వల్ల ఇక్కడి ప్రజల సంస్కృతి విధ్వంసానికి గురికాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ ప్రతినిధులతో బాటు, సభ్య సమాజం పై కూడా ఉంది.