ఎలమంచిలి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండలంలో మొత్తం జనాభా 68,480 ఇందులో మగవారి సంఖ్య 33,817 , ఆడవారి సంఖ్య 34,663. అక్షరాస్యలు (2011) ప్రకారం మొత్తం 59.88% ఇందులో పురుషులు 70.60% మంది మరియు స్త్రీలు 49.53%.
ఎలమంచిలి ఒకప్పుడు ఎల్లా-మజిలిగా పిలిచేవారు. ఈ పట్టణానికి కళింగ మరియు ఆంధ్ర సామ్రాజ్యం సరిహద్దు గ్రామాలు. ఈ పట్టణానికి సరిహద్దులో ఉన్న అన్ని ప్రాంతాలలో పన్నులు వసూలు చేయడానికి ఈ ప్రదేశాన్ని ఉపయోగించేవారు. భారతదేశంలో బౌద్ధమత, జైనమత మరియు మధ్యయుగ హిందూ మత కాలంనాటి చారిత్రక మరియు పురావస్తు ఆధారాలు ఎలమంచిలి చుట్టుప్రక్కల ప్రదేశాలలో కనుగొనబడ్డాయి. ఒకప్పుడు ఈ ప్రాంతం శాతవాహనుల పాలనలో ఉంది. తూర్పు కనుమల చుట్టుపక్కల కొండల చుట్టూ ఉన్న పంచధార్ల, ధరపాలెం మరియు ఎలమంచిలి పరిసరాల నుండి కొన్ని పూర్వ-చారిత్రిక పరిశోధనలు వెలికితీయబడ్డాయి. ఈ త్రవ్వకాల మీద పరిశోధనా పని పురోగతిలో ఉంది. ఇటీవలే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా కనుగొన్నారు.
615 లో తూర్పు చాళుక్యుల రాజు కుబ్జ విష్ణువర్ధన్ చే సర్వసిద్ధి గ్రామం (ఎలమంచిలి నుండి 10 కిమీ) నిర్మించబడింది .
మండలంలో 70% మంది ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం మరియు పాడి పశువుల పెంపకం. మండలం పూర్తిగా వర్షాధారిత ప్రాంతం. సముద్ర తీరానికి దగ్గరగా ఉండడం కారణంగా నైరుతి ఋతుపవనాల వల్ల 72% వర్షపాతం, ఈశాన్యరుతుపవనాల వల్ల 13% వర్షపాతాన్ని మండలం పొందుతున్నది. వార్షిక సరాసరి వర్షపాతం 1200 మిమీగా నమోదు అవుతున్నది. నేలలు వదులుగా ఉండే ఎర్ర మట్టినేలలు. ఇసుకపాలు ఎక్కువ. నీరు ఇంకి పోయే స్వభావం కలవి. పంటపొలాల విస్తీర్ణం 6842 హెక్టార్లు. పెదపల్లి ప్రాంతంలో 365 హెక్టార్ల విస్తీర్ణం గల అడవి ఉంది. ఖరీఫ్ సీజన్లో పల్లపుభూములలో ఆహార పంటగా వరి పండిస్తారు. వాణిజ్యపంటగా చెరకు వేస్తారు. కొన్ని గ్రామాలలో పొగాకు కూడా పండిస్తారు. మెట్టభూముల్లో చోళ్ళు (రాగులు) గంటెలు, నువ్వులు, వేరుశనగ పంటలు వేస్తారు. మిరప, కందుల పంటలు అక్కడక్కడ కనిపిస్తాయి. వంగ, బీర, ఆనప, టమోటా వంటి కూరగాయలను కూడా పండిస్తున్నారు. మండలంలోని కొక్కిరాపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుత్వం వారి "నూనె గింజల" పరిశోధనాకేంద్రం ఉంది. ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ అనుభందమైన ఈ కేంద్రంలో నువ్వుల విత్తనాలపై పరిశోధనలు జరుగుచున్నవి. రైతులకు వ్యవసాయం తర్వాత ప్రధాన ఆదాయ వనరు గేదెల పెంపకం ద్వారా పాల ఉత్పత్తి. తరచు సంభవించే వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలకు గ్యారంటీ లేదు. మండలం లోని కొన్ని గ్రామాలను ఆనుకొని శారద, వరాహ నదులు ప్రవహిస్తున్నప్పటికి వాటి వల్ల ప్రయోజనం తక్కువ. గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టు (ఇందిరా సాగర్ ప్రాజెక్ట్) పూర్తయితే ఈ మండలం సస్యశ్యామలం అవుతుంది. త్రాగునీటి సమస్యకూడా తీరుతుంది.
మండలంలో చెప్పుకోతగిన పరిశ్రమలేవీ లేవు. మండలంలో ఏటి కొప్పాక గ్రామంలో సహకార చక్కెర కర్మాగారం 1933 సం.లో ఏర్పాటయింది. ఇది రాష్ట్రంలో సహకారరంగంలో ఏర్పడిన మొట్టమొదటి చక్కెర కర్మాగారం. రేగుపాలెం వద్ద 2009 లో సిమెంట్ కర్మాగారం ఏర్పాటయింది. యలమంచిలికి దగ్గరగా ఉన్న అచ్యుతాపురం ఎస్.ఇ.జెడ్ లో నిర్మించబడిన బ్రాండిక్స్ దుస్తుల కర్మాగారం కొంతమందికి ఉపాది కల్పిస్తున్నది. విశాఖపట్నంలో పనిచేసే చిరుద్యోగులు యలమంచిలిని తమ నివాస ప్రాంతంగా ఎంచుకోవడం వల్ల గృహనిర్మాణ రంగం ముందంజలో నున్నది.