బొబ్బిలి (ఆంగ్లం: Bobbili)', ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాలోని ఒక పట్టణం, అదే పేరుతో గల ఒక మండలానికి కేంద్రం.
ఉత్కృష్టమైన చరిత్ర కలిగిన పట్టణమిది. పరాసు ప్రభువుల (ఫ్రెంచి) పాలనలో ఒక సంస్థానంగా ఉన్న బొబ్బిలికి పొరుగు రాజ్యం విజయనగరంతో శతృత్వం ఉండేది. ఈ శతృత్వం ముదిరి బొబ్బిలికీ, పరాసు, విజయనగర సంయుక్త సైన్యానికి మధ్య యుద్ధానికి దారితీసింది. ఆ యుద్ద్ధంలో జరిగిన మారణకాండ, బొబ్బిలి వెలమ వీరుల, తెలగ వీరుల, బొందిలి వీరుల వీరమరణాలు, బొబ్బిలి స్త్రీల ఆత్మాహుతి మొదలైనవి బొబ్బిలి కథకు ఒక వీరోచిత జానపద గాథ స్థాయి కల్పించాయి. బొబ్బిలి ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలోని ఒక నియోజకవర్గం.
బ్రిటిషు వారి ఇంపీరియల్ గెజెట్ ప్రకారం బొబ్బిలి వివరాలిలా ఉన్నాయి. బొబ్బిలి అప్పటి విజాగపటం జిల్లాలో ఉండేది. 1901లో దీని జానాభా 17,387. బొబ్బిలి రాజా వారి సంస్థానం 227 చ.మై. విస్తీర్ణంలో ఉండేది. ఆదాయం - రూ 40,000. అందులో భూమి శిస్తు: రూ 9,000.
జనవరి 24, 1757లో బుస్సీ బొబ్బిలిపై చేసిన దాడి భారత చరిత్రలో ఒక మరపురాని ఘట్టం. బొబ్బిలికి, పొరుగున ఉన్న విజయనగరానికి మధ్య నిరంతర శతృత్వం ఉండేది. విజయనగర రాజు బుస్సీతో చేతులు కలిపి బొబ్బిలిపై దాడి చేసాడు. బొబ్బిలి వెలమ వీరులు, తెలగ వీరులు, బొందిలి వీరులు వీరమరణాలు చెందగా, స్త్రీలు ఆత్మ త్యాగం చేసారు. యుద్ధం ముగిసాక, విజయరామరాజు తన గుడారంలో నిదుర పోతుండగా, బొబ్బిలి రాజు బావమరిది యైన తాండ్ర పాపారాయుడు అతడిని హతమార్చాడు.
బొబ్బిలి రాజు రంగారాయుని కుమారుడు, పసి బాలుడు చిన్న రంగారావు బుస్సీకి చిక్కాడు. ఆ బాలుడినే బొబ్బిలి రాజుగా బుస్సీ పట్టాభిషేకం చేసాడు. అయితే అతని పసితనాన్ని అవకాశంగా తీసుకుని బంధువులు రాజ్య పీఠాన్ని ఆక్రమించుకున్నారు. విజయనగరం రాజుతో సంధి కుదిరినా అది తాత్కాలికమే అయింది. ఇద్దరి మధ్యా మళ్ళీ ఘర్షణలు మొదలై బొబ్బిలి రాజు పారిపోయి నిజాము రాజ్యంలో తలదాచుకున్నాడు. 1794లో బ్రిటిషు వారు చిన్న రంగారావును మళ్ళీ పీఠంపై కూర్చోబెట్టారు.
1801 లో ఆయన కుమారుడితో బ్రిటిషువారు శాశ్వత సంధి ఒడంబడిక కుదుర్చుకున్నారు. రాజా అనే బిరుదును వంశపారంపర్య చిహ్నంగా గుర్తించారు. మహారాజ బిరుదును చిన్న రంగారావు ముని మనుమడైన సర్ వేంకటాచలపతి రంగారావుకు వ్యక్తిగత హోదాగా సమర్పించారు.